కెరీర్‌లో తొలిసారిగా.. నవ్విస్తానంటున్న అందాల రాక్షసి

  • IndiaGlitz, [Tuesday,November 30 2021]

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠీ తొలి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో గిలిగింతలు పెట్టింది. ఒకవైపు గ్లామర్ తో మాత్రమేకాక, మరోవైపు నటనతో కూడా అందరిని ఆకట్టుకుంటోంది. కెరీర్‌లో చిన్నాచితకా హీరోలతోనే నటించిన ఆమెకు.. స్టార్ హీరోల పక్కన, పెద్ద దర్శకులతో చేయ్యాలన్న కల నెరవేరడం లేదు. అయినప్పటికీ వచ్చిన అవకాశాలను విడిచిపెట్టకుండా.. మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ వస్తోంది.

ఈ ఏడాది చావు కబురు చల్లగా మరియు ఏ వన్ ఎక్స్‌ప్రెస్ సినిమాలలో కనిపించింది లావణ్య . ఇప్పటి వరకు కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌లో మాత్రమే ఎక్కువగా నటించిన ఆమె.. త్వరలో సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. కెరీర్‌లో తొలిసారిగా క్రైమ్ కామెడీ మూవీలో లావణ్య నటించనున్నారు. ‘‘మత్తువదలారా’’ ఫేమ్ రితేశ్ రానా దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఆమె నటించనున్నారు. దీనిపై లావణ్య సైతం స్పందించారు. మత్తువదలారా చిత్రాన్ని తాను చూశానని.. రితేశ్ పనితనం నచ్చిందన్నారు.

రితేష్ రాణాతో బడా నిర్మాణ సంస్థ... మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తోంది. అందులో లావణ్యా త్రిపాఠి హీరోయిన్‌గా కన్ఫర్మ్ అవ్వగా... హీరో ఎవరనేది త్వరలో వెల్లడి కానుంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కనున్న ఈ మూవీలో తన క్యారెక్టర్ ప్రేక్షకులను స‌ర్‌ప్రైజ్ చేస్తుంద‌ని లావణ్య చెబుతున్నారు. ఇప్పటికే క్యారెక్టర్ కోసం వ‌ర్క్‌షాప్స్‌కు కూడా హాజరవుతున్నారట. స్క్రిప్ట్‌తో పాటు త‌న‌కు స్క్రీన్‌ప్లే బాగా న‌చ్చింద‌ని ఆమె తెలిపారు. త‌న లుక్ కోసం మేకోవ‌ర్ అవుతున్నాన‌ని అది ఖచ్చితంగా స‌ర్‌ప్రైజ్ చేస్తుంద‌ని లావ‌ణ్యా త్రిపాఠి వెల్లడించారు.

రియ‌ల్ లైఫ్‌లో లావ‌ణ్యా త్రిపాఠి చాలా కలివిడిగా ఉంటారు. జోకులు వేస్తూ తన చుట్టుప‌క్క‌ల ఉన్న‌వాళ్ల‌ను న‌వ్విస్తారు. అయితే, ఇప్ప‌టివ‌ర‌కూ తన తన నిజ జీవితానికి దగ్గరగా వుండే క్యారెక్టర్‌ను చేయ‌లేదు. ఆన్ స్క్రీన్ కామెడీ రోల్ చేయ‌డం ఇదే తొలిసారి. కాగా.. సినిమాల ఎంపికలో లావణ్యా త్రిపాఠి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆమెకు సంబంధించి మరో మూడు సినిమాలు చర్చల దశలో వున్నాయట.