కుల వివాదంపై లావణ్య త్రిపాఠి కౌంటర్ ట్వీట్.. తొలగింపు
- IndiaGlitz, [Wednesday,September 11 2019]
సమ సమాజంలో కుల మతాలకు చోటు ఉండకూడుదు. ప్రస్తుత నాగరికత సమాజంలో కుల మతాల మధ్య అంతరం తగ్గుతుంది. అయితే కూడా కొన్ని చోట్ల పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కులాల ఆధారంగా గొడవలు జరుగుతున్నాయి. కుల సంఘాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మేం గొప్పంటే మేం గొప్ప అనుకుంటున్నారందరూ. సరే! ఇదెవరో సామాన్యుడు అనుకుంటే సరేలే! తెలియక అన్నాడులే అని సరిపెట్టుకోవచ్చు. కానీ సాక్షాత్తూ లోకసభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లానే కుల వ్యవస్థను ప్రోత్సహించేలా ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల బ్రాహ్మణ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ''సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నతస్థానం ఉంటుంది. ఆయన(పరుశురాముడుని ఉద్దేశిస్తూ) ఆయన త్యాగం, తపస్సు ఫలితంగానే ఇది సాధ్యమైంది. అందుకనే బ్రాహ్మణులు సమాజానికి మార్గదర్శకత్వం వహించగలుగుతున్నారు'' అంటూ ట్వీట్ చేశారు ఓం ప్రకాశ్ బిర్లా.
అయితే ఈ ట్వీట్‌కు టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కౌంటర్ ఇచ్చింది. ''నేనూ బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయినే. అయితే వ్యక్తులు వారు చేసే పనుల కారణంగానే గొప్పవారు అవుతారు. కులం వల్ల కాదు'' అంటూ ట్వీట్ చేసింది. అయితే తదుపరి ఎలాంటి పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుందోనని భయపడి ఆ ట్వీట్‌ను తొలగించింది.