‘లవకుశ’లో లవుడు పాత్రధారి కన్నుమూత
- IndiaGlitz, [Monday,September 07 2020]
‘లవకుశ’ నాగరాజు కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన నేడు గాంధీనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ‘లవకుశ’ చిత్రంలో నాగరాజు లవుడు పాత్రను పోషించారు. లలితా శివజ్యోతి పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శంకరరెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, అంజలీదేవి సీతారాములుగా నటించగా.. నాగరాజు, సుబ్రహ్మణ్యం.. లవకుశులుగా నటించారు. కాంతారావు, చిత్తూరు నాగయ్య ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
నాగరాజు అసలు పేరు నాగేంద్రరావు. ఆయన తండ్రి పేరు ఏవీ సుబ్బారావు. నాగరాజు తండ్రి కూడా తెలుగులో గొప్ప నటుడు. అయన కీలుగుర్రం, హరిశ్చంద్ర వంటి సినిమాల్లో నటించారు. నాగరాజు కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా భక్త రామదాసు సినిమాలో నాగయ్య కొడుకుగా నటించారు. ‘లవకుశ’ విజయంతో నాగరాజుకి వరుస సినిమా అవకాశాలొచ్చాయి. దాదాపుగా 300 సినిమాలకు పైగా నటించారు. ఆయనకు చిన్న వయస్సులోనే పెళ్లైంది. నాగరాజుకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.
‘లవకుశ’ చిత్రం 1963లో విడుదలైంది. లవకుశ సినిమాను ఉత్తర రామాయణం ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో లవుడుగా నాగరాజు పెర్ఫార్మెన్స్ అద్భుతం. తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు తొలుత సి.పుల్లయ్య దర్శకత్వం వహించగా.. ఆయన అనారోగ్యం పాలు కావడంతో ఈ సినిమా చిత్రీకరణ కొంత కాలం పాటు ఆగిపోయింది. అనంతరం ఆయన కుమారుడు సి.ఎస్.రావు దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు.