ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్‌డేట్..
- IndiaGlitz, [Wednesday,September 16 2020]
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడుతోంది. కరోనా కారణంగా చికిత్స నిమిత్తం ఆయన చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఆయనకు కరోనా నెగిటివ్ అని తేలింది. అప్పటి నుంచి క్రమక్రమంగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగవుతూ వస్తోంది. తాజాగా ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఎస్పీబీ ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగవుతోందని.. అయినప్పటికీ ఎక్మో, వెంటిలేటర్ సాయంతోనే చికిత్స కొనసాగుతోందన్నారు.
తన తండ్రికి వైద్య సేవలందిస్తున్న ఎంజీఎం ఆసుపత్రి వైద్య బృందానికి.. తన తండ్రి ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కరోనా సోకడంతో ఆగస్ట్ 5న ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అనంతరం కొద్ది రోజులకే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను ఐసీయూకి తరలించి.. వెంటిలేటర్‌పై ఉంచి ఎక్మో సాయంతో చికిత్సను అందిస్తున్నారు. బాలు ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు అభిలషించారు.