తెలంగాణలో భారీగా పెరిగిన సినిమా టికెట్ల ధరలు.. ఆ థియేటర్‌లో చూడాలంటే రూ.350
- IndiaGlitz, [Friday,December 31 2021]
ఏపీలో సినిమా టికెట్ ధరలను తగ్గింపు వ్యవహారం పెద్ద దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతున్నారు. సర్కార్ ఏర్పాటు చేసిన కమిటీ కూడా టికెట్ల పెంపుకు సంబంధించి అధ్యయనం చేస్తోంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రావడంతో థియేటర్లు ధరలను పెంచాయి. పెంచిన ధరల ప్రకారం…మహేష్ బాబుకి చెందిన ఏఎంబి సినిమాస్‌లో అదే విధంగా ప్రసాద్స్ ఐమాక్స్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ ధర రూ.350, సెకండ్ క్లాస్ టికెట్ ధరను 295 కు సవరించారు.
ఇక పివిఆర్ మల్టీప్లెక్స్ థియేటర్లలో ఫస్ట్ క్లాస్ టికెట్ ధర రూ. 350, సెకండ్ క్లాస్ టికెట్ ధర రూ. 290కి , థర్డ్ క్లాస్ టికెట్ ధరను రూ. 150 గా ఫిక్స్ చేశారు. ఏషియన్ మల్టీప్లెక్స్ థియేటర్ల లో ఫస్ట్ క్లాస్ టికెట్ ధర రూ. 350, సెకండ్ క్లాస్ టికెట్ ధర రూ.250, థర్డ్ క్లాస్ టికెట్ ధర రూ. 175 గా సవరించారు. పెంచిన ధరలు హైదరాబాద్ నగరంలోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయి.
త్వరలో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెరిగిన ధరలతో నైజాంలో కలెక్షన్లు గట్టిగానే వచ్చే అవకాశం ఉంది. అయితే తెలంగాణాలో సినిమా టికెట్ల ధరని విపరీతంగా పెంచడంతో చిన్న సినిమా నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ రేట్ల పెంపు జీవోను సరిగ్గా వాడుకోవాలని వారు సూచిస్తున్నారు. పెద్ద సినిమాలకు రేట్లు ఎక్కువగా ఉన్నా, చిన్న సినిమాలకు మాత్రం తక్కువ రేట్లు ఉండేలా చూడాలని నిర్మాతలు కోరుతున్నారు. చిన్న సినిమాలకు మినిమమ్ ప్రైజ్, మీడియమ్ సినిమాలకు వారంపాటు మ్యాక్జిమమ్ ప్రైజ్, పెద్ద సినిమాలకు రెండు వారాలు మ్యాక్జిమమ్ ప్రైజ్ ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.