స్లో పాయిజిన్‌తో లతాజీ హత్యకు కుట్ర: వంటమనిషి మాయం, నేటికీ మిస్టరీయే..!!

దిగ్గజ గాయని లతా మంగేష్కర్ మరణంతో దేశం మూగబోయింది. లతాజీ నిష్క్రమణతో భారతీయ సంగీత ప్రపంచంలో ఓ అధ్యాయం ముగిసినట్లయ్యింది. ఈ నేపథ్యంలో ఆమె వ్యక్తిగత విషయాలు, కెరీర్‌, తదితర అంశాలను తెలుసుకునేందుకు నెటిజన్లు ఇంటర్నెట్‌ను జల్లెడపడుతున్నారు. ఈ క్రమంలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. అదే లతాజీ హత్యకు కుట్ర వ్యవహారం.. 13 ఏళ్ల చిరు ప్రాయంలోనే గాయనిగా కెరీర్‌ను ప్రారంభించారామె. 1942లో ‘నాచు యా గదే’ అనే మరాఠీ పాటతో ప్రేక్షకులకు పరిచయమైన లతా మంగేష్కర్.. అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. హిందీ, మరాఠీలతో పాటు భారతదేశంలోని దాదాపు అన్ని భాషల్లోనూ ఆమె పాటలు పాడారు. ఆ విధంగా లతాజీ కెరీర్ పీక్స్‌లో వున్న సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది.

1962 ప్రాంతంలో లతాకు ఎవరో స్లో పాయిజన్ ఇచ్చారు. దాదాపు చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఆమె.. మూడు నెలల తర్వాత పూర్తిగా కోలుకున్నారు. ఈ ఘటనపై లతా మంగేష్కర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పుడు తాను చాలా అనారోగ్యానికి గురయ్యానని.. దాదాపు మూడు నెలలు కోలుకోలేకపోయాని చెప్పారు. తన కడుపులో చాలా అసౌకర్యంగా ఉండేదని.. ఎవరో గట్టిగా నెట్టేస్తున్నట్లు అనిపించేదని, పచ్చ రంగులో వాంతులు అయ్యేవని లతా మంగేష్కర్ తెలిపారు. కదల్లేని పరిస్థితిలో ఉండటంతో డాక్టర్లు ఇంట్లోనే ఎక్స్‌రే తీసుకునేవాళ్లని.. తన ఆరోగ్యం బాగోలేదు కాబట్టే ఇలా జరుగుతుందని అనుకునేదాన్నని ఆమె చెప్పారు. కానీ, డాక్టర్లు తనపై విషప్రయోగం జరిగిందని చెప్పారు లతాజీ తెలిపారు.

ప్రముఖ రచయిత, లతా సన్నిహితురాలు పద్మ సచ్‌దేవ్ రాసిన పుస్తకంలోనూ ఆమె ఈ స్లో పాజిటివన్ విషయాన్ని ప్రస్తావించారు. లతాజీ అనారోగ్యానికి గురైన తర్వాత ఆమె వంట మనిషి ఆకస్మాత్తుగా కనిపించకుండా పోయిందని పద్మ తెలిపారు. ఆమెతో ఎవరు ఆ పనిచేయించారేనేది నేటికీ మిస్టరీనే అని చెప్పారు. ఈ ఘటన తర్వాత పాటల రచయిత మజ్రూమ్ సుల్తాన్‌పూరీ లతకు అండగా నిలిచారు. ఆహారాన్ని ముందు తను తిని.. దాని వల్ల ఏ ప్రమాదం లేదని తెలిసిన తర్వాతే లతాకు పెట్టేవారట.