ఇక సెలవ్.. అధికారిక లాంఛనాలతో ముగిసిన లతా మంగేష్కర్ అంత్యక్రియలు
Send us your feedback to audioarticles@vaarta.com
అనారోగ్యంతో మరణించిన దిగ్గజ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. ముంబయి శివాజీ పార్కులో ఆమె పార్థివ దేహానికి ప్రధాని మోడీతో పాటు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దంపతులు, పలువురు కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర కేబినెట్ మంత్రులు, బాలీవుడ్ ప్రముఖులు లతా మంగేష్కర్‌కు తుది వీడ్కోలు పలికారు.
అంతకుముందు ఆమె నివాసం నుంచి శివాజీ పార్క్ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. తమ అభిమాన గాయనికి వీడ్కోలు పలికేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ముంబైకి తరలిరావడంతో నగర రోడ్లన్నీ జనసంద్రాన్ని తలపించాయి. అనంతరం సైనికాధికారులు లతాజీకి గౌరవవందనం సమర్పించారు. లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఈ రెండు రోజులూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర భవనాలపై ఉన్న జాతీయ జెండాను అవనతనం చేస్తారు. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. కరోనా పాజిటివ్‌గా తేలడంతో లతా మంగేష్కర్‌ను జనవరి 8న ముంబైలోని బీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అప్పటినుంచి ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అభిమానులు, సినీ ప్రముఖులు, దేశ ప్రజల కోసం ఎప్పటికప్పుడు లతాజీ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను హాస్పిటల్ యాజమాన్యం వెల్లడిస్తూనే ఉంది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకొన్నట్లు వైద్యులు, కుటుంబసభ్యులు ప్రకటించారు. అయితే నిన్న లతాజీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం లతా మంగేష్కర్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout