Lasya:ప్రభుత్వ లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు.. సీఎం రేవంత్ రెడ్డి నివాళులు..
Send us your feedback to audioarticles@vaarta.com
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సీఎస్‌ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో లాస్య నందిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం లాస్య నందిత పార్థివ దేహాన్ని కార్ఖానాలోని ఆమె నివాసానికి తరలించారు. ప్రమాదంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయని.. దవడ ఎముక, ఎడమ కాలు ఎముక పక్కటెముకలు విరిగాయని.. పళ్లు కూడా ఉడిపోయాయని తెలిపారు.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆమె పార్థివ దేహానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఇక బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఎంపీ కేకే, మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, తదితర నాయకులు ఆమెకు నివాళులు అర్పించారు. ఈస్ట్ మారేడ్ పల్లిలోని శ్మశాన వాటికలో లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె తండ్రి సాయన్న అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే ఆమె అంత్యక్రియలను కుటుంబసభ్యులు పూర్తి చేశారు.
మరోవైపు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఆమె కారు రెయిలింగ్‌తో పాటు ముందున్న లారీని ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నారు. అతి వేగంతో వచ్చిన కారు ముందున్న వాహనాన్ని ఢీకొట్టిన ఆనవాళ్లను గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు, అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మీటర్ బోర్డు 100 కి.మీ స్పీడ్ వద్ద స్ట్రైక్ అయినట్లు గుర్తించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై రెయిలింగ్‌ను మాత్రమే ఢీకొంటే ఈ స్థాయిలో ప్రమాదం జరగకపోవచ్చని పేర్కొంటున్నారు. పూర్తి విచారణ తర్వాతే అన్ని వివరాలు వెల్లడిస్తాని తెలిపారు.
కాగా ఇవాళ తెల్లవారుజాము పటాన్‌చెరు ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన ప్రమాదంలో ఆమె స్పాట్‌లోనే మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout