Postal Ballot: ఏపీలో భారీగా నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. ఏ పార్టీకి లాభమో..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి పదిరోజులు దాటిపోయింది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది. దీంతో పెరిగిన పోలింగ్ ఏ పార్టీకి మద్దతుగా ఉందో అంతుచిక్కడం లేదు. ఎవరికి వారే తమకే మద్దతుగా ఓట్లు పడ్డాయని అంచనా వేసుకుంటున్నారు. ఇదంతా ప్రభుత్వానికి పాజిటివ్ ఓట్లని అధికార వైసీపీ చెబుతుండగా.. ప్రభుత్వ వ్యతిరేకత అని కూటమి నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగానే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ఈసారి భారీగా నమోదైంది.
జిల్లాల నుంచి వచ్చిన తాజా లెక్కల ప్రకారం రికార్డు స్థాయిలో 5 లక్షల 39 వేల 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. 25,283 ఓట్లతో నంద్యాల జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇక 24, 918 ఓట్లతో కడప జిల్లా మూడో స్థానంలో ఉండగా.. అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మరోవైపు పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు అనుగుణంగా కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటుపై ప్రస్తుతం ఎన్నికల సంఘం అధికారులు చర్చలు జరుపుతున్నారు.
మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది కీలకంగా మారింది. అయితే గత చరిత్ర ఆధారంగా చూస్తే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా పోలైతే ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. దీని ఆధారంగా ఉద్యోగులు ప్రభుత్వ వ్యతిరేకతతో తమకే ఓటేశారని టీడీపీ చెబుతుండగా.. ప్రభుత్వ విధానాలు నచ్చి తమకే ఓటేశారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.
ఇక నరసరావుపేట పార్లమెంటు స్థానం పరిధిలో 85.65 శాతం పోలింగ్ నమోదైందని సీఈవో కార్యాలయం తెలిపింది. 1967 నుంచి ఇప్పటివరకు 15 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా ఇదే అత్యధిక పోలింగ్ శాతం అని పేర్కొంది. నరసరావుపేట లోక్సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య 17,34,858 అని వెల్లడించింది. అందులో 14,85,909 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని స్పష్టం చేసింది. ఇందులో పురుషులు 85.94 శాతం, మహిళలు 85.37 శాతం, ట్రాన్స్ జెండర్లు 46.07 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించింది.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే చిలకలూరిపేట-85 శాతం, గురజాల-84.30, మాచర్ల-83.75, నరసరావుపేట-81.06, పెదకూరపాడు-89.18, సత్తెనపల్లి-86.97, వినుకొండ-89.22 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొంది. మరి భారీగా నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లుతో పాటు కీలక నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ఏ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయో జూన్ 4వ తేదీ ఫలితాల్లో వెల్లడికానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments