Postal Ballot: ఏపీలో భారీగా నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. ఏ పార్టీకి లాభమో..?

  • IndiaGlitz, [Saturday,May 25 2024]

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి పదిరోజులు దాటిపోయింది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది. దీంతో పెరిగిన పోలింగ్ ఏ పార్టీకి మద్దతుగా ఉందో అంతుచిక్కడం లేదు. ఎవరికి వారే తమకే మద్దతుగా ఓట్లు పడ్డాయని అంచనా వేసుకుంటున్నారు. ఇదంతా ప్రభుత్వానికి పాజిటివ్ ఓట్లని అధికార వైసీపీ చెబుతుండగా.. ప్రభుత్వ వ్యతిరేకత అని కూటమి నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగానే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ఈసారి భారీగా నమోదైంది.

జిల్లాల నుంచి వచ్చిన తాజా లెక్కల ప్రకారం రికార్డు స్థాయిలో 5 లక్షల 39 వేల 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. 25,283 ఓట్లతో నంద్యాల జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇక 24, 918 ఓట్లతో కడప జిల్లా మూడో స్థానంలో ఉండగా.. అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మరోవైపు పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు అనుగుణంగా కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటుపై ప్రస్తుతం ఎన్నికల సంఘం అధికారులు చర్చలు జరుపుతున్నారు.

మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది కీలకంగా మారింది. అయితే గత చరిత్ర ఆధారంగా చూస్తే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా పోలైతే ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. దీని ఆధారంగా ఉద్యోగులు ప్రభుత్వ వ్యతిరేకతతో తమకే ఓటేశారని టీడీపీ చెబుతుండగా.. ప్రభుత్వ విధానాలు నచ్చి తమకే ఓటేశారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

ఇక నరసరావుపేట పార్లమెంటు స్థానం పరిధిలో 85.65 శాతం పోలింగ్ నమోదైందని సీఈవో కార్యాలయం తెలిపింది. 1967 నుంచి ఇప్పటివరకు 15 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా ఇదే అత్యధిక పోలింగ్ శాతం అని పేర్కొంది. నరసరావుపేట లోక్‌సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య 17,34,858 అని వెల్లడించింది. అందులో 14,85,909 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని స్పష్టం చేసింది. ఇందులో పురుషులు 85.94 శాతం, మహిళలు 85.37 శాతం, ట్రాన్స్ జెండర్లు 46.07 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించింది.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే చిలకలూరిపేట-85 శాతం, గురజాల-84.30, మాచర్ల-83.75, నరసరావుపేట-81.06, పెదకూరపాడు-89.18, సత్తెనపల్లి-86.97, వినుకొండ-89.22 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొంది. మరి భారీగా నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లుతో పాటు కీలక నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ఏ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయో జూన్ 4వ తేదీ ఫలితాల్లో వెల్లడికానుంది.

More News

MLC Elections: తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం.. గెలుపుపై పార్టీల ధీమా..

పార్లమెంట్ ఎన్నికలు ముగిసినా కూడా తెలంగాణలో మాత్రం ఎన్నికల హడావిడి ఇంకా తగ్గలేదు. మే 27(సోమవారం) జరగనున్న ఉమ్మడి నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగిసింది.

ప్రభాస్ 'బుజ్జి' కారును నడిపిన చైతన్య.. 'కల్కి' టీమ్‌కి హ్యాట్సాఫ్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రభాస్‌ అభిమానులతో పాటు

Hema: రేవ్ పార్టీ కేసులో నటి హేమకు షాక్.. విచారణకు రావాలని నోటీసులు..

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ కావడంతో నటి హేమకు నోటీసులు ఇచ్చారు. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

TTD:భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం.. బ్రేక్ దర్శనాలు రద్దు..

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.. గత వారం రోజులుగా శ్రీవారి దర్శనం కోసం కొండపైకి భక్తులు బారులు తీరారు.

KTR:సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీని కోర్టుకు లాగుతాం.. కేటీఆర్ వార్నింగ్..

బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.