చిక్కుల్లో లాలూ ప్రసాద్ యాదవ్.. ఆ స్కామ్‌లో దోషిగా నిర్ధారణ, మరోసారి జైలుకు తప్పదా..?
- IndiaGlitz, [Tuesday,February 15 2022]
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. డోరాండా ట్రెజరీ కేసులో లాలూ మరోసారి జైలుకు వెళ్లనున్నారు. ఆయనను దోషిగా తేలుస్తూ మంగళవారం రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే శిక్షను ఖరారు చేయాల్సి వుంది. ఇదే కేసులో మరో 24 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
1990- 95 మధ్యకాలంలో బిహార్ సీఎంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో పశుసంవర్థక శాఖలో రూ.950 కోట్ల దాణా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి 1996లో సీబీఐ 53 కేసులు నమోదు చేసింది. వీటిలో డోరాండా ట్రెజరీ కేసు అతి ముఖ్యమైనది. ట్రెజరీ నుంచి రూ. 139.35 కోట్ల రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేయడంపై ఈ కేసు నమోదైంది. ఈ కేసులో 1996లో సీబీఐ పలు కేసులు నమోదు చేసింది.
170 మందిని నిందితులుగా పేర్కొంది. ఇందులో 55 మంది ఇప్పటికే చనిపోగా.. మరో ఏడుగురిని ప్రభుత్వ సాక్ష్యులుగా సీబీఐ తెలిపింది. మరో ఇద్దరు తీర్పు రాకముందే నేరాన్ని అంగీకరించగా.. ఆరుగురు ఇప్పటికీ పరారీలో వున్నారు. మరో 99 మంది తీర్పు కోసం నిరీక్షిస్తున్నారు. లాలూ ప్రసాద్‌తో పాటు మాజీ ఎంపీ జగదీశ్ శర్మ, డా. ఆర్కే రాణా సహా పలువురు ఈ డోరాండా ట్రెజరీ కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగు కేసుల్లో లాలూ ప్రసాద్ యాదవ్‌కు న్యాయస్థానం 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది . అయితే వీటిలో లాలూకు పాట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నాటి నుంచి ఆయన బయటే వుంటున్నారు.