రామ్‌గోపాల్ వర్మ సినిమా తీస్తానని అనాలేగానీ, సంచలనానికి అది కేంద్రబిందువు అవుతుంది. అలాంటిది లెజండరీ పర్సనాలిటీ ఎన్టీఆర్ జీవితంలో వైశ్రాయ్ ఘటనను కీలకంగా చేసుకుని ఆయన చేసిన చిత్రం `లక్ష్మీస్ ఎన్టీఆర్`. ప్రీ పబ్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ వర్మ ఈ సారి మరింత రెచ్చిపోయాడు. ఓ వైపు నందమూరి బాలకృష్ణకు థాంక్స్ చెబుతూనే, మరోవైపు వైశ్రాయ్ ఘటన గురించి ప్రస్తావిస్తూనే. నిజాలను తను నమ్మిన కోణం నుంచి చెప్పానని ముందు నుంచీ చెప్తూ వచ్చాడు. దానికి తోడు ఆంధ్రలో ఈ సినిమా విడుదల కాకపోవడం, తెలంగాణలో విడుదల కావడం వంటివన్నీ ఆయన ప్రీ పబ్లిసిటీకి మరింత ఊతాన్నిచ్చాయి. ఇటీవలి కాలంలో ఇంత పబ్లిసిటీ మధ్య విడుదలైన `లక్ష్మీస్ ఎన్టీఆర్` ఎలా ఉంది? వర్మ చేసిన ఫ్రీ.. ప్రీ పబ్లిసిటీ సినిమాకు ఎంత వరకు హెల్ప్ అవుతుంది... చదివేయండి.
రాజకీయాల్లో పరాభవం తర్వాత ఒంటరితనంతో బాధపడుతుంటారు నందమూరి తారక రామారావు. అతని జీవిత చరిత్ర రాయాలనే ఉద్దేశంతో ఒక అభిమానిగా అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది లక్ష్మీ పార్వతి. ఆమె వయసు మరీ తక్కువగా ఉందని, తన చరిత్ర రాయాలంటే ఆ అనుభవం సరిపోదని ముందు తిరస్కరిస్తాడు ఎన్టీఆర్. అయితే ఆమెతో ఒక రోజంతా గడిపిన తర్వాత,ఆమె మాట తీరు చూసిన తర్వాత అతనికి ఆమె తెలివితేటలపై నమ్మకం కుదిరి అంగీకరిస్తాడు. క్రమంగా అతని జీవితంలో వెలితి ఆమె వల్ల తొలగిపోవడాన్ని గుర్తిస్తాడు. వారిద్దరి మధ్య చనువు చూసి ఒక వైపు పుకార్లు చెలరేగుతుంటాయి. ఒక సందర్భంలో తన జీవితంలో లక్ష్మీ ఉంటే బావుంటుందని భావిస్తారు ఎన్టీఆర్. ఆమెను పెళ్లి చేసుకోమని అడుగుతారు. అప్పటకే పెళ్లయిన ఆమె అదే విషయాన్ని తన భర్తతో చెప్పి చట్టపరంగా విడిపోతుంది. ఇంకోవైపు ఎన్టీఆర్ సంతానం ఈ విషయంపై చిరాకుపడతారు. ఆమెను పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ జీవితంలో జరిగిన మార్పులేంటి? ఆయన తీసుకున్న నిర్ణయాలకు కూడా వంటింటి రాజకీయాలు అనే పేరు పెట్టి పత్రికలు రాసిన వైనం ఎలాంటిది? వైస్రాయ్ హోటల్‌లో ఏం జరిగింది? అసలు ఎన్టీఆర్ కన్నుమూయడానికి ముందు ఏం జరిగింది వంటి వివరాలతో రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రమే `లక్ష్మీస్ ఎన్టీఆర్`.
ప్లస్ పాయింట్లు:
సినిమాను మొదలుపెట్టిన తీరు, నటీనటుల హావభావాలను బట్టి, ఎవరెవరో సులభంగా గుర్తించేలా మేకప్పులు,బాడీ లాంగ్వేజ్ సినిమాకు హైలైట్స్. అక్కడక్కడా డైలాగులు బావున్నాయి. చాలా ఫ్రేములు వర్మ ఇతర సినిమాల్లో ఉన్నవే అయినా, ఇందులో సరిపోయాయి. అన్నిటికి మించి ముఖ్యంగా సెకండాఫ్ మొదలైంది మొదలు ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా ఎంగేజింగ్‌గా ఉంది. రీరికార్డింగ్ అక్కడక్కడా కాస్త ధ్వనులు అనిపించినా, చాలా వరకు మెప్పించింది.
మైనస్ పాయింట్లు:
సినిమాలో అన్నిసార్లు `లక్ష్మీ` అనడం, అన్ని సార్లు `స్వామీ` అనడం... సినిమా చూసే ప్రేక్షకులకు ఒక సందర్భంలో విసుగు కలిగిస్తాయి. ఎన్టీఆర్ జీవితంలో సాంత్వన చేకూర్చడానికి ఆయన దగ్గరకు చేరిన లక్ష్మీపార్వతి అక్కడ అడుగుపెట్టినప్పటి నుంచీ కన్నీళ్లు కారుస్తూనే ఉందా? ఆమెను అంతగా క్షోభ పెట్టారా? అనేది మరో అనుమానం. మొదటి నుంచి కూడా చంద్రబాబునాయుడు పాత్రను కుట్రదారుడిగానే చూపించడం ఎంత వరకు సబబో వర్మకే తెలియాలి. క్లైమాక్స్ లో లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌కు దూరమైందని సింబాలిక్‌గా చెప్పడానికి ప్రయత్నించినా, టక్కున చూసిన వారందరూ వాస్తవానికి విరుద్దంగా ఉన్నాయని చెప్పడం గమనార్హం. ప్రతి చిన్న సందర్భంలోనూ పాట ఎందుకో అర్థం కాదు..
విశ్లేషణ:
నిజానికి చాలా కోణాలుంటాయి. చెప్పేవారికి ఒక కోణం, చూసిన వారిది ఒక కోణం.. ఆ పరిస్థితులను అనుభవించిన వారిది మరో కోణం. `లక్ష్మీస్ ఎన్టీఆర్`లో వర్మ తాను నమ్మిన నిజాన్ని చెప్పారంతే. ఈ సినిమాలో నిజాలు లేవా? అంటే లేకుండా పోలేదు. అలాగని అన్నీ నిజాలేనా? అంటే కాకపోవచ్చు. ప్రీ క్లైమాక్స్ లో లక్ష్మీ పార్వతి హాలులో కూర్చుని ఏడుస్తున్నప్పుడు కెమెరా యాంగిల్ పైన ఉన్న ఫ్యాన్ గుర్తుకు ఫ్రీజ్ కావాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు. ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి కేవలం మానసిక సాంత్వన కోసమే ఒకరికొకరు తోడుగా ఉన్నారనే అనుకున్నా, ఎన్టీఆర్ ఆ వయసులో చేసిన డ్యాన్సులు చూస్తే ఎవరికైనా నవ్వురాకమానదు. పదే పదే లక్ష్మీ లక్ష్మీ అనడం, పదే పదే స్వామీ స్వామీ అనడం చిరాకు కలిగిస్తాయి. లక్ష్మీపార్వతి వెళ్లినప్పుడు ఎన్టీఆర్ పరిస్థితి వేరు కావచ్చు, ఆ తర్వాత మారి ఉండవచ్చు. వైస్రాయ్ ఘటనలో తీవ్ర మనస్తాపానికి ఎన్టీఆర్ గురయి ఉండవచ్చు. రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఘటనను వర్మ తాను నమ్మిన రీతిలో తెరకెక్కించారు. చంద్రబాబుగా నటించిన తేజ్ యాప్ట్ గా చేశాడు. యజ్ఞాశెట్టి కూడా ఫర్వాలేదు. ఎన్టీఆర్ పాత్రధారి శాయశక్తులా కృషి చేశాడు. మిగిలిన వారు ఎవరు ఎవరో కూడా గుర్తుండరు. కాకపోతే నిజ జీవిత పాత్రల పేర్లను బట్టి ఎవరు ఎవరై ఉంటారో ఊహించుకోవచ్చు. పత్రికాధినేతను , న్యాయవాదిని ఇందులో పూర్తిగా కుట్రపూరితులుగా చూపించారు. లక్ష్మీ పార్వతికి అణ్యంపుణ్యం తెలియదన్నట్టే చెప్పారు. ఎమోషన్‌ని మాత్రం వర్మ చక్కగా క్యారీ చేశారు. అసలు ఈ పొలిటికల్ డ్రామా ఏమీ తెలియనివారికి సినిమా బాగానే ఉంటుంది. కానీ జరిగింది తెలిసినవారు మాత్రం అప్పటి అంశాలతో పోల్చి చూసుకుంటారు. వర్మ టైటిల్ కరెక్ట్ గానే పెట్టారని భావిస్తారు.
బాటమ్ లైన్: ఈ ఎన్టీఆర్... లక్ష్మీ పార్వతి ఎన్టీఆరే!
Comments