ఎన్టీఆర్‌పై లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Monday,November 18 2019]

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా.. పాలిటిక్స్‌కు ఏ మాత్రం సంబంధం లేకుండా సినిమాల్లో నటించుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ పేరు మార్మోగుతోంది. అయితే తనకు పాలిటిక్స్‌కు.. రాజకీయ నేతలు చేసే ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేదని.. జూనియర్ నెత్తీనోరూ మొత్తుకున్నా ఈయన్ను మాత్రం అటు టీడీపీ నేతలు.. ఇటు వైసీపీ మంత్రులు, నేతలు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. మంత్రి కొడాలి నాని.. ఇద్దరూ అసలు ఎన్టీఆర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు పక్కనెట్టారు..? అసలు కారణాలేంటి..? ఎవరి కోసం ఆయన్ను పక్కనెట్టారు..? అనే విషయాలను పూసగుచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. అయితే ఇందుకు స్పందించిన టీడీపీ నేతలు.. స్ట్రాంగ్ కౌంటర్ల వర్షం కురిపిస్తూ.. ‘అస్సలు ఎన్టీఆర్ మాకు అక్కర్లేదు.. మా పార్టీకి ఆయన సేవలు అస్సలు వద్దు.. మా నాయకుడు చంద్రబాబు చాలా స్ట్రాంగ్’ అంటూ చెప్పుకొచ్చారు.

జూనియర్‌కు కమాండ్ ఉంది!
అయితే ఈ తరుణంలో ఎన్టీఆర్ సతీమణి, ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జూనియర్, నారా లోకేష్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘నారా లోకేష్ కంటే ఎన్టీఆర్ 100 రెట్లు బెటర్. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ప్రజలను మెప్పించగలిగే నటనతో పాటు మంచి వాక్ చాతుర్యం కూడా ఉంది. సబ్జెక్ట్ మీద జూనియర్‌కు మంచి అవగాహన , కమాండ్ ఉంది. లోకేష్‌ ఏ విషయం పై అవగాహన లేదు. రాసిచ్చిన స్క్రిప్ట్‌లో ఏమి చదవాలో కూడా తెలియదు’ అని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. అయితే ఇదే ఇంటర్వ్యూలో ఆమె చంద్రబాబుపై యథావిథిగానే తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. సీఎం జగన్‌ను ఆకాశానికెత్తేశారు.

ఎదురుచూపులు..!
ఇదిలా ఉంటే.. 2009 ఎన్నికల్లో చంద్రబాబు.. అప్పటి చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీని ధీటుగా ఎదుర్కొవడానికి జూనియర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. అయితే అదేం దురదృష్టమో కానీ.. ఎన్టీఆర్ ప్రచారం చేసిన చోటల్లా టీడీపీ ఓడిపోయింది. ఇందుకు కారణమేంటో..? లోలోపల ఏం జరిగిందో అనేది మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు కానీ.. నాటి నుంచి నేటి వరకూ రాజకీయాల జోలికే జూనియర్ పోలేదు.. అందుకే తాజాగా ఆయన్ను రావాల్సిందేనని ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయో...? ఆయన ఎక్కడ వస్తాడో అని ఇలా తెలుగు తమ్ముళ్లు మాట్లాడుతున్నారో తెలియట్లేదు. మరి వీటన్నింటికీ జూనియర్ ఎప్పుడు మీడియా ముందుకొచ్చి ఫుల్‌స్టాప్ పెడతారో అని నందమూరి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.