బాలయ్యపై లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్!

  • IndiaGlitz, [Wednesday,January 09 2019]

దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడైన ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి.. హీరో బాలకృష్ణను మెచ్చుకున్నారు. అదేంటి లక్ష్మీపార్వతికి - నందమూరి కుటుంబానికి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయ్ కదా.. మెచ్చుకోవడమేంటని కాసింత ఆశ్చర్యమనిపిస్తోంది కదూ. అవును మీరు వింటున్నది నిజమే. అసలేం జరిగింది..? ఎందుకు మెచ్చుకున్నారు..? అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

బాలయ్య చాలా మంచోడు..!
బుధవారం నాడు తిరుమల వెంకన్నను దర్శించుకున్న లక్ష్మీ పార్వతి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ బయోపిక్, బాలయ్య గురించి మాట్లాడాలని మీడియా ప్రతినిధులు అడగ్గా ఆమె నవ్వుతూ మాట్లాడారు. నిజంగా బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి. బాలకృష్ణ అంటే భయానికే భయమేస్తుందని అయన అభిమానులు అంటూ ఉంటారు. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని బాలయ్య ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు.. కానీ బాలయ్య ఒక భయస్తుడు. బాలయ్య వ్యక్తిగతంగా చాలా మంచోడు అతనిని నేను ఎప్పుడు తప్పు బట్టను.. కానీ బాలయ్య చంద్రబాబుకి భయపడుతున్నారు. ఎన్టీఆర్ కుటుంబంతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు. దివంగత ఎన్టీఆర్‌పై బాలయ్య ఎన్ని సినిమాలు తీసినా అది సగభాగమే అవుతుంది అని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ తప్పక చూడండి..!
బయోపిక్ సినిమా పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లోనే రూపొందింది. స్వర్గీయ ఎన్టీఆర్‌కి సంబంధించి పూర్తి వాస్తవాలు ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో కన్పిస్తాయి. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంతోనే ఎన్టీఆర్ జీవితం పూర్తవుతుంది. ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర తెలియాలి అంటే రామ్ గోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ అందరూ తప్పకుండా చూడాలి. ఎందుకంటే అందులో నిజానిజాలు అన్ని కూడా భయటకు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో వర్మ ఈ సినిమాని తెరపైకి తీసుకువస్తారు.. తప్పకుండా రిలీజ్ చేస్తారు.. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పటి వరకూ ఆర్జీవీని ఆకాశానికెత్తిన లక్ష్మీ పార్వతి.. వర్మ విడుదల చేసిన రెండో పాట తనకు బాధను కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్మ మనసులో అసలు ఏముందో తనకు తెలియట్లేదని చెప్పుకొచ్చారు.

నాకు ఆహ్వానం రాలేదు..
‘ఎన్‌టిఆర్‌ బయోపిక్‌’ మూవీని చూడాల్సిందిగా తనను ఎవరూ ఆహ్వానించలేదని.. ఆ సినిమా పట్ల ఎన్టీఆర్‌ నిజమైన అభిమానుల్లోనూ ఆసక్తి కూడా లేదని, అందరూ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నారని లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా బాలయ్యపై లక్ష్మి పార్వతి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో, వెబ్‌సైట్లలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ బయోపిక్ టీమ్.. బాలయ్య ఎలా స్పందిస్తారో అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.