ఇదేం మామూలు విషయం కాదు: లక్ష్మీనారాయణ
- IndiaGlitz, [Saturday,June 08 2019]
ఆంధప్రదేశ్ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఆ షాక్ నుంచి తేరుకోక మునుపే నేతలు జంపింగ్‌లు షురూ చేశారు. దీంతో జిల్లాల బాట పట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కార్యకర్తలకు ధైర్యం చెబుతూ ముందుకు నడుస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. శనివారం నాడు విశాఖ జిల్లాలో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఆంధ్రాలో మార్పు ప్రారంభమైందని.. భవిష్యత్తులో కచ్చితంగా జనసేన పార్టీ పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు.
యువతలో ఆసక్తి మొదలైంది!
ఎన్నికల్లో గెలవకపోయినా.. నన్ను 2,88,754 మంది ఓటుతో ప్రజలు ఆశీర్వదించారు. పార్టీ పరంగా కూడా కొద్దిసమయంలోనే ఇంత పురోగతి సాధించడం మామూలు విషయం కాదు. ఎన్నికల్లో జనసేనలో లోపాలు ఎక్కడెక్కడ వచ్చాయనే విషయాన్ని పవన్ కల్యాణ్ అందరితో చర్చించారు. జనసేన ప్రతిపాదించిన ‘జీరో బడ్జెట్ పాలిటిక్స్’ యువతలోకి బాగా వెళ్లింది. ధనప్రభావం లేని రాజకీయాలపై యువతలో ఆసక్తి మొదలైంది.
గతంలో నేను రైతులను కలిసేందుకు పాదయాత్ర చేశాను. ఇకముందు కూడా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాను. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వద్దకు కూడా వెళతాము అని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కాగా ఈ కార్యక్రమంలో.. తోట చంద్రశేఖర్, మాదాసు గంగాధరంతో పాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.