పీఎన్బీలో ప్రకంపనలు.. ఖాతాల్లో లక్షలు మాయం
Send us your feedback to audioarticles@vaarta.com
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13 వేల కోట్ల రూపాయాల రుణం ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం నిగ్గు తేలకమునుపే ఈ బ్యాంక్లో జరిగిన కుంభకోణాలు.. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా బట్టబయలైన ఉదంతంతో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలేం జరిగింది..? తాజా ఉదంతం ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అసలేం జరిగింది..!?
ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేసేటప్పుడు.. విత్ డ్రా చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకు సిబ్బందే కాదు.. పదే పదే ప్రకటనలు, సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతుంటారు. అయితే కొన్ని కొన్ని చోట్ల ఖాతాదారుని ప్రమేయం లేకుండా లావాదేవీలు జరిగిపోతున్నాయ్. తాజాగా పీన్బీ ఖాతారుల సొమ్ములు మాయమైన వైనం ఆలస్యం వెలుగుచూసింది. ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారులు స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. మూడు రోజుల వ్యవధిలోనే ఒకరిద్దరు కాదు ఏకంగా 61 మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి రూ. 15 లక్షలు గల్లంతవ్వడంతో అందోళన చెందుతున్నారు.
ఇదీ అసలు సంగతి..!
వారం రోజుల క్రితం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారుడు ఒకరు తనకు తెలియకుండానే.. తన ఏటీఎంలు, పాస్బుక్లు అన్నీ తనదగ్గరుండగానే లావాదేవీలు జరిగినట్లు ఎస్ఎమ్మెస్లు వస్తున్నాయని ఢిల్లీలోని వసంత్ విహార్ బ్రాంచ్ మేనేజర్ సంప్రదించారు. ఆ ఖాతాదారుడి మాటలు విన్న బ్యాంక్ మేనేజర్ ఒకింత కంగుతిన్నారు. అసలేం జరిగిందా..? అని ఆరాతీసిన బ్యాంక్ సిబ్బంది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మొదటి ఫిర్యాదుదారుడు వ్యవహారం వెలుగు చూసిన అనంతరం బాధితుల సంఖ్య పెరిగిపోయింది.
మొత్తం ఎంత..!?
ఖాతాదారుల ఫిర్యాదు ప్రకారం మొత్తం రూ. 14, 97,769 సొమ్ము అక్రమార్కులు కొట్టేశారని తేలింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరు దీనికి కర్మ, కర్మ, క్రియ అనేది అతి త్వరలోనే తేల్చుతామని వసంత్ విహార్ డీసీపీ దేవేందర్ ఆర్యా మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే పీఎన్బీ ఖాతాదారులు ఎప్పుడేం జరుగుతుందా అని టెన్షన్ పడుతున్నారు. అయితే ఈ వ్యవహారం ఎందాకా వెళ్తుందో.. బాధితులకు పోలీసులు, బ్యాంక్ పరిష్కారం చూపి డబ్బులు వెనక్కి ఇప్పిస్తుందో లేదో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments