గజిబిజీ తీర్పు కాదు.. ఏపీలో హంగ్ రాదు: లగడపాటి
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అప్పుడెప్పుడో తెలంగాణ ఎన్నికల్లో దర్శనమిచ్చి తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలు దగ్గరపడుతుండటంతో మరోసారి మీడియా ముందుకు వచ్చి హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే ఆక్టోపస్ చేసిన సర్వే అట్టర్ ప్లాప్ కావడంతో లగడపాటి అడ్రస్ లేకుండా వెళ్లిపోయారు!. అయితే ఏపీ ఎన్నికల్లోనూ తాను జోస్యం చెబుతానని.. గెలిచేదెవరో చెబుతాను.. ఓడేదెవరో చెబుతాను అంటూ ఎగ్జిట్ ఫలితాలకు ముందు ఒక రోజు మీడియా ముందుకు వచ్చి ఊదరగొడుతున్నారు. అయితే తెలంగాణలో ఇంత జరిగిన తర్వాత కూడా ఈయన ఎవరు నమ్ముతారు..? ఎవరు నమ్మరు..? అనేది ఇక్కడ అప్రస్తుతం. శనివారం సాయంత్రం అమరావతి రాజధాని ప్రాంతంలోని మల్కాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్లో లగడపాటి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో హంగ్ రాదు..!
"ఆంధ్రప్రదేశ్లో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం లేదు.. కచ్చితమైన మెజార్టీతోనే ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలుగు ప్రజలు ఎప్పుడూ స్పష్టమైన తీర్పే ఇచ్చారు. తెలుగు ప్రజలు ఎప్పుడూ గజిబిజిగా తీర్పు ఇవ్వలేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా కేంద్రంతోనూ ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉన్నందున సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయోనని ఉత్కంఠతో ఎదరుచూస్తున్నారు.
రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే కాకుండా, కేంద్రంలో ఎవరు వస్తారన్న దానిపైన కూడా రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంది. ఎగ్జిట్ పోల్స్, సర్వేలు రేపు సాయంత్రం కొద్దిగా స్పష్టతనిస్తాయి. ఈ నెల 23తో పూర్తి స్పష్టత వస్తుంది. రాజధాని నిర్మాణం, చేపట్టిన ప్రాజెక్టులు.. కేంద్రం, రాష్ట్ర సహకారంతోనే సాధ్యమన్న ప్రత్యేక దృష్టితో ప్రజలు చూస్తున్నారు" అని లగడపాటి చెప్పుకొచ్చారు.
అద్భుతంగా ఉండబోతోంది!
"ఏపీ ఫలితాలపై ఎవరూ బాధపడాల్సిన పనేమీ లేదు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం అద్భుతంగా ఉండబోతోంది. ఇంద్రప్రస్థం స్థాయిలో అమరావతి ఎవరూ ఊహించనంత దివ్యంగా ఉంటుంది. అలనాటి మాయసభలాంటి అసెంబ్లీ భవనం అమరావతిలో రాబోతోంది. అందరూ అసూయపడేలా మన రాజధాని అభివృద్ధిలోకి వస్తుంది. మన రాజధాని కోసం రైతులు త్యాగం చేశారు. ప్రతి ఒక్కరూ రాజధానిపై ఆసక్తితో చూస్తున్నారు. మనం కోరుకోకుండానే రాష్ట్రం వచ్చింది. ఇది ఎలా అభివృద్ధి అవుతుందోనని వారు ఆరాటం ప్రదర్శించారు.
గిట్టనివాళ్లు అసూయపడేలా రాజధాని తయారవుతుంది. ఒకవేళ ప్రభుత్వాలు మారినా ఎలాంటి తేడారాదు. దేశంలో ఇలాంటి పరిస్థితి కొన్నిసార్లు వచ్చింది కానీ, ఎక్కడా అభివృద్ధి రివర్స్ అయిన దాఖలాలు లేవు. అడుగు ముందుకే పడింది తప్ప వెనక్కి వెళ్లింది ఎక్కడా లేదు కాబట్టి ఎవరొచ్చినా అభివృద్ధి ఆగదు. కాకపోతే కొత్త ప్రభుత్వాలు వస్తే కాస్త అటూఇటూగా ఉంటుంది తప్ప పెద్దగా మార్పేమీ ఉండదు" అని ఆంధ్రా ఆక్టోపస్ తేల్చిచెప్పారు. సో.. తెలంగాణలో అట్టర్ ప్లాప్ అయిన ఆక్టోపస్ సర్వే.. ఏపీలో ఏ మేరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout