బాలయ్యపై ఈ లేడీ యాంకర్ గెలుస్తుందా!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో గత కొద్దిరోజులుగా ‘ప్రజాశాంతి’ పార్టీ వ్యవస్థాపకుడు, క్రైసవ మతబోధకుడు నానా హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో గెలిచేది తమ పార్టీనే అని.. టీడీపీ, వైసీపీ, జనసేన ఏ పార్టీలకు డిపాజిట్లు రావని తనకు తానుగా జోస్యం చెప్పుకుంటూ వస్తున్నారు పాల్. ఇలా ప్రతి రోజూ సంచలనాలతో వార్తల్లో నిలుస్తున్న పాల్.. ఈ సారి ఏకంగా తన పార్టీ నుంచి పోటీ చేసే ఇద్దరు అభ్యర్థుల పేర్లు ప్రకటించేశారు. ఇద్దరూ మహిళలు కావడం విశేషం. అందులో ఒకరు టీవీ యాంకర్ శ్వేతారెడ్డి కాగా.. మరొకరు అమలాపురంకు చెందిన లక్ష్మీ తులసీ. ఈ ఇద్దర్నీ పాల్.. రెండ్రోజుల కిందటే పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది.
బాలయ్యపై శ్వేతారెడ్డి పోటీ..
2014 ఎన్నికల్లో హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ గెలుపొందిన సంగతి తెలిసిందే. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూడా బాలయ్యే అక్కడ్నుంచి పోటీచేయబోతున్నారు. దీంతో ఆయన్ను ఓడించాలని ప్రముఖ టీవీ యాంకర్ శ్వేతారెడ్డిని రంగంలోకి దింపుతున్నట్లు పాల్ చెప్పుకొచ్చారు. కాగా.. ప్రజాశాంతి పార్టీ అనేది కేవలం క్రైస్తవులకే కాదని.. అందరికీ మేలుచేస్తూ అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఒక్క శ్వేతారెడ్డికే కాకుండా అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేస్తానని పాల్ పేర్కొన్నారు. అయితే ఈ నియోజకర్గంలో టీడీపీ-వైసీపీలు పోటాపోటీగా ఉన్నాయి. ఈ పోటీని పాల్ పార్టీ ఎంత మేరకు తట్టుకోగలదు.. ఎన్ని ఓట్లు వస్తాయో.. ఏమో.!
ఇక అమలాపురం అభ్యర్థి విషయానికొస్తే..
అమలాపురం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీ తులసి అనే అమ్మాయిని బరిలోకి దింపుతున్నట్లు పాల్ ప్రకటించారు. నిరుద్యోగురాలైన ఈమె పాల్ పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. కాగా ఈ అమలాపురం నియోజకవర్గం తూర్పుగోదావరిలో కీలకమైనది. అమలాపురంలో ఎలాగైనా మరోసారి జెండా ఎగరేయాలని టీడీపీ.. గతంలో మిస్సయింది ఈ సారి కచ్చితంగా తామే గెలుస్తామని వైసీపీ ఉంది. మొత్తానికి చూస్తే పోటీ మాత్రం రసవత్తరంగానే ఉంటుంది. అయితే పాల్ పార్టీ ఎలా ఉండబోతోందన్నది ఆ దేవుడికే ఎరుక.
కాగా.. ఇప్పటికే ఏపీలోని పలు నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించిన పాల్.. పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీ కోసం 44వేల మంది కో-ఆర్డినేటర్లు పనిచేస్తున్నారని చెప్పిన ఆయన.. రాబోయే రోజుల్లో 2 కోట్ల మందిని తమ పార్టీలోకి చేరుస్తారని జోస్యం చెబుతున్నారు పాల్. అయితే ఇంత హడావుడి చేసిన పాల్‌కు ‘ఏ మేరకు సీట్లు వస్తాయో కాదు.. కాదు.. ఓట్లు వస్తాయో’ తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments