L7 మూవీ రివ్యూ

  • IndiaGlitz, [Friday,October 21 2016]

తుంగ‌భ‌ద్ర ఫేం అరుణ్ అదిత్ హీరోగా రాహుల్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ముకుంద్ పాండే ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ‌ర్ర‌ర్ చిత్రం 'ఎల్‌7'. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో హ‌ర్ర‌ర్ చిత్రాల ట్రెండ్ న‌డుస్తుంది. ఈ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని ద‌ర్శ‌కుడు ముకుంద్ పాండే తెరెక్కించిన ఎల్‌7 ప్రేక్ష‌కుల‌ను ఏ మేర అల‌రించిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే....

క‌థః

అరుణ్‌(అరుణ్ ఆదిత్‌) వైజాగ్‌లో ప్రియా(పూజ జ‌వేరి)ని ప్రేమించి పెళ్లిచేసుకుని హైద‌రాబాద్‌కు తీసుకొస్తాడు. ఓ అద్దె ఇంట్లో కాపురం పెడ‌తారు. కానీ చేరిన రెండో రోజునే అరుణ్ ఉద్యోగం పోతుంది. దాంతో ఇంటిలో వాస్తు దోషం ఉండటం వల్లే అరుణ్ ఉద్యోగం పోయింద‌నుకుని ఇల్లు మారాల‌నుకుంటారు. కానీ అరుణ్‌కు మ‌రో సంస్థ‌లో పెద్ద ఉద్యోగం వ‌స్తుంది. కానీ ప్రియా తీరులో మార్పు వ‌స్తుంది. ప్రియా తీరు చూసిన అరుణ్‌కు త‌న ఇంట్లో దెయ్యం ఉందేమోన‌ని సందేహం వ‌స్తుంది. దాంతో అరుణ్ సిటీలోని సోమ‌నాథ్ అనే స్వామిజీని క‌లుస్తాడు. సోమ‌నాథ్ స్వామిజీ అరుణ్‌కు కొన్ని నిజాలు చెబుతాడు. ఆ నిజాలేంటి? అస‌లు ప్రియా శరీరంలో దెయ్యం ఉంటుందా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

స‌మీక్షః

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే...హీరో అరుణ్ అదిత్ హండ్రెడ్ ప‌ర్సెంట్ న్యాయం చేశాడు. దెయ్యం త‌న భార్య రూపంలో ఉంద‌ని తెలిసి త‌న భార్య‌ను కాపాడాలనుకునే భ‌ర్త పాత్ర‌లో చ‌క్క‌గా రాణించాడు. ఇక హీరోయిన్ పూజ ఝ‌వేరి న‌ట‌న ప‌రంగా చ‌క్క‌టి అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించింది. దెయ్యం అవ‌హించిన వ్య‌క్తిలా సెకండాఫ్‌లో పూజ న‌ట‌న బావుంది. ఇక సినిమాలో వెన్నెల‌కిషోర్‌, దీప‌క్ అనే మ‌రో న‌టుడు చేసిన కామెడి ట్రాక్ సింప్లీ సూప‌ర్బ్‌. దెయ్యాన్ని త‌రిమికొట్టాల‌నే ఉద్దేశంతో వెన్నెల‌కిషోర్‌, దీప‌క్‌లు చేసే న‌ట‌న‌, ముఖ్యంగా వెన్నెల‌కిషోర్ హావ‌భావాలు, డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌కు న‌వ్వును తెప్పిస్తాయి. టెక్నిషియ‌న్స్ విష‌యానికి వ‌స్తే... సాధార‌ణంగా హ‌ర్ర‌ర్ సినిమాల్లో దెయ్యం ఉండ‌టానికి కార‌ణం, చివ‌ర‌కు ఆ దెయ్యం కూడా ఎలా రీవేంజ్ తీర్చుకుంద‌నేదే క‌థ‌. 'ఎల్‌7' మెయిన్ కాన్సెప్ట్ అదే అయినా ముకుంద్ పాండే ఆ క‌థ‌ను తెర‌పై చూపించ‌డానికి రాసుకున్న కార‌ణం కొత్త‌గా అనిపించింది. ప్ర‌పంచంలో మ‌నుషుల‌ను పోలిన మ‌నుషులు ఏడుగురు ఉంటారు. అలాంటి వారిలో ఏ ఇద్ద‌రైనా ఒకే ముహుర్తాన పుడితే ఏమ‌వుతుంద‌నే కాన్సెప్ట్‌లో ముకుంద్ అల్లుకున్న క‌థ‌, క‌థ‌నం బావున్నాయి. హ‌ర్ర‌ర్ సినిమాల స‌క్సెస్‌లో కీల‌క పాత్ర వ‌హించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, సినిమాటోగ్ర‌ఫీలు ఈ సినిమాకు ప్ల‌స్ అయ్యాయి. దుర్గాప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ, అర‌వింద్ శంక‌ర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలిచాయ‌నే చెప్పాలి. సెకండాఫ్‌లోనే అస‌లు సినిమా ర‌న్ అవుతుంది. ఫ‌స్టాఫ్ అంతా దాదాపు రొటీన్ హ‌ర్రర్ సినిమాల త‌ర‌హాలోనే ఉంటుంది. స్పెష‌ల్ సాంగ్ అసంద‌ర్భంగా ఉంది. ఎడిటింగ్ బావుంది. మొత్త‌మీద హ‌ర్ర‌ర్ సినిమాలను ఎంజాయ్ చేయాల‌నుకునే ప్ర‌క్ష‌కులు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు.

బోట‌మ్ లైన్ః ఎల్‌7....ఆక‌ట్టుకునే హ‌ర్ర‌ర్ మూవీ..

రేటింగ్ః 2.75/5