డిఫరెంట్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కుందనపు బొమ్మ - డైరెక్టర్ వర ముళ్లపూడి
- IndiaGlitz, [Monday,June 20 2016]
నా అల్లుడు, విశాఖ ఎక్స్ ప్రెస్...చిత్రాల దర్శకుడు వర ముళ్లపూడి తెరకెక్కించిన తాజా చిత్రం కుందనపు బొమ్మ. ఈ చిత్రంలో సుధాకర్, సుధీర్, చాందిని చౌదరి హీరో, హీరోయిన్స్ గా నటించారు. విభిన్న ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ విభిన్న ప్రేమకథా చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కుందనపు బొమ్మ దర్శకుడు వర ముళ్లపూడితో ఇంటర్ వ్యూ మీకోసం...
కుందనపు బొమ్మ కథ ఏమిటి..?
విజయనగరం, బొబ్బిలి నేపధ్యంలో జరిగే విభిన్న ప్రేమకధా చిత్రమిది. ఈ చిత్రంలో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫేం సుధాకర్, సుధీర్, చాందిని చౌదరి నటించారు. ప్రేమకథా చిత్రాలు చాలా వచ్చినప్పటికీ మా చిత్రం కొత్తగా ఉంటుంది. డిఫరెంట్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కించిన కుందనపు బొమ్మ అందర్ని ఆకట్టుకుంటుంది.
సుధాకర్, సుధీర్, చాందిని చౌదరి...ఈ ముగ్గురిని ఎంచుకోవడాని కారణం ఏమిటి..?
ఈ ముగ్గురితో నాకు అసలు పరిచయం లేదు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సుధాకర్ ని ఫస్ట్ కాంటాక్ట్ చేసినప్పుడు ట్రైయాంగిల్ లవ్ స్టోరీ...పైగా అతను ఫస్టాఫ్ లో కనిపించడు... అతనికి సాంగ్స్ లేవు. అందుచేత ఈ ప్రాజెక్ట్ పై సుధాకర్ అంతగా ఇంట్రస్ట్ చూపించలేదు. అయితే... మేము సెకండ్ టైమ్ అడిగేసరికి ఓకే చెప్పాడు. ఇంకో హీరో సుధీర్ ని ఫస్ట్ నుంచి అనుకున్నాం. ఇక హీరోయిన్ గురించి చెప్పాలంటే...ఫస్ట్ నుంచి తెలుగమ్మాయి కోసం ట్రై చేసాం. తమిళ్, హిందీ అమ్మాయిలను చూసాం కానీ...నచ్చలేదు. పైగా ఈ క్యారెక్టర్ కి భాష తెలిసిన వాళ్లు అయితేనే బాగుంటుంది. అయితే మా ప్రొడ్యూసర్ & రైటర్ చాందిని చౌదరిని ఓ షార్ట్ ఫిల్మ్ లో చూసారట. ఈ క్యారెక్టర్ కి బాగుంటుంది అని చెప్పారు.నాకు కూడా ఈ క్యారెక్టర్ కి చాందిని బాగుంటుంది అనిపించడంతో ఆమెనే సెలెక్ట్ చేసాం. క్యారెక్టర్ కి తగ్గట్టు అద్భుతంగా నటించింది. భవిష్యత్ లో ఖచ్చితంగా చాందిని నటిగా మంచి పేరు తెచ్చుకుంటుంది.
నా అల్లుడు తర్వాత మీరు బిగ్ ప్రాజెక్ట్స్ చేయలేదు...ట్రై చేయలేదా..?
నా అల్లుడు తర్వాత పెద్ద సినిమాలు చేయాలని ప్రయత్నించాను. కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ...అవి నాకు నచ్చలేదు. నా అల్లుడు తర్వాత విశాఖ ఎక్స్ ప్రెస్ చేసాను మంచి పేరు వచ్చింది. ఆతర్వాత ఓ పది కథలు రెడీ చేసాను. అయినా... నా అల్లుడు సినిమా నేను ప్లాన్ చేసి చేసింది కాదు. రాజమౌళి సలహా వలన నాకు ఆ సినిమా చేసే అవకాశం వచ్చింది. విశాఖ ఎక్స్ ప్రెస్ తర్వాత నేను సినిమాలు చేయలేదు కానీ...సీరియల్స్, యాడ్స్ చేసాను. మా సిస్టర్ కంపెనీ కోసం యాడ్స్ చేస్తున్నాను. యాడ్స్ అనేది షార్ట్ టైమ్ లో ఎక్కువ కంటెంట్ చెప్పాలి కనుక సినిమాల కన్నా బాగా ఎక్సైట్ గా ఉంటుంది. అయినా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే బిగ్ ఆఫర్స్ వస్తాయి. ఇక నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలనుకుంటున్నాను.
ఈ మూవీకి కీరవాణి గారు మ్యూజిక్ అందిచారు కదా...ఆడియో రెస్పాన్స్ గురించి..?
కుందనపు బొమ్మ ఆడియోకు చాలా మంచి స్పందన లభిస్తోంది. స్ర్కిప్ట్ వినకుండానే కీరవాణి గారు ఈ మూవీకి మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో ఓ డ్యూయోట్ ఉంది. అది నాకు, అనంత శ్రీరామ్ కు చాలా బాగా నచ్చింది. అలాగే బాపు, రమణ గారు ఓ పాటను రాసుకున్నారు. అది ఏ సినిమాలోను వాడలేదు. ఆ పాటను ఈ సినిమాలో పెట్టాం. ఆడియోకు మంచి రెస్పాన్స్ లభిస్తుండడం నాకు చాలా సంతోషంగా ఉంది.
ఈ చిత్రానికి రాఘవేంద్రరావు గారు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు కదా...ఈ సినిమా చూసారా..?
రాఘవేంద్రరావు గారు నిర్మించిన సీరియల్స్ ని నేను డైరెక్ట్ చేసాను. నేను రాసుకున్న కథల్లో కుందనపు బొమ్మ కథ బాగుంటుందని రాఘవేంద్రరావు గారే ఈ కథను సెలెక్ట్ చేసారు. ఆయన ఈ చిత్రానికి సమర్పకుడుగా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఆయనని అడిగిన వెంటనే ఒప్పుకున్నారు. ఆయనకు కథ నచ్చడం వలనే ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించారని నేను అనుకుంటున్నాను. పాటలు చూసారు చాలా బాగున్నాయి అని చెప్పారు. ఇక సినిమాని రిలీజ్ రోజు చూస్తారు.
ఇప్పుడు కొత్తతరం దర్శకులు వచ్చారు కదా..పోటీని తట్టుకోగలరా..?
కొత్తతరం దర్శకులు మంచి కథలతో సినిమాలు చేస్తున్నారు. కథ - స్ర్కీన్ ప్లే లో కొత్తదనం ఉండాలి. టెక్నిక్ అనేది సెకండరీ అని నా అభిప్రాయం. అందుచేత కొత్తకథలతో కొత్త కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోగలను అనే నమ్మకం ఉంది.
రాజమౌళితో మీకు మంచి అనుబంధం ఉంది కదా...మీతో ఆయన సినిమా నిర్మించాలి అనుకోలేదా..?
రాజమౌళి విశ్వామిత్ర బ్యానర్ లో నాతో చిన్న సినిమాలు తీయాలి అనుకున్నారు. కానీ...రాజమౌళి బిజీగా ఉండడం వలన కుదరలేదు. నాకు తెలిసి రాజమౌళి సినిమాలు నిర్మించడేమో అనుకుంటున్నాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
బాపు - రమణ కలిసి రాసిన ఓ కథ ఉంది. అది వాళ్లు సినిమాగా తీయాలనుకున్నారు కానీ..కుదరలేదు. ఆ కథను ట్రెండ్ కి తగ్గట్టు మారుస్తున్నాను. ఈ కథతో సినిమా తీయాలనుకుంటున్నాను. ఇది కూడా లవ్ స్టోరీనే. నిత్యామీనన్ దృష్టిలో పెట్టుకుని ఈ కథను రెడీ చేస్తున్నాం. అలాగే పెద్ద బ్యానర్స్ లో కూడా సినిమాలు చేయడం కోసం కథా చర్చలు జరుగుతున్నాయి.