ఏ క్షణమైనా కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయే అవకాశం!
- IndiaGlitz, [Saturday,July 06 2019]
కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఏ క్షణమైనా కుమారన్న సర్కార్ కుప్పకూలిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా చేయగా.. ఇవాళ మరో 12 మంది ఎమ్మెల్యేల రాజీనామా చేసేశారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలను సమర్పించారు. కొన్ని రోజులుగా ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. శనివారంతో అది మరింత ముదిరింది. అయితే ఈ వ్యవహారం అంతా సీఎం కుమారస్వామి అమెరికా టూర్‌లో ఉన్నప్పుడు జరుగుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచ నేతలు మంత్రులు, ట్రబుల్ షూటర్స్ టెన్షన్ టెన్షన్‌గా ఉన్నారు.
అదను చూసి దెబ్బకొడుతోందిగా!
సీఎం రాష్ట్రంలో లేని సమయంలో బీజేపీ అదను చూసి దెబ్బకొట్టిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్.. రాష్ట్రాల్లో బలపడే అంశంపై ఫోకస్ పెట్టింది. అవకాశం ఉన్న చోట అధికారాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కర్నాటకపై దృష్టి పెట్టిందని రాజకీయ నేతలు చెబుతున్నారు.
జరుగుతున్న పరిణామాలను బీజేపీ నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ పరిస్థితులను క్యాష్ చేసుకోవాలని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారట.
ఆయన రాకముందే సర్కార్ కూలుతుందా..!
కాగా.. కుమారస్వామి ఆదివారం అనగా.. జూలై 07 రాత్రి బెంగళూరు చేరుకోనున్నారు. ఆలోపే ప్రభుత్వం కూలిపోతుందా? అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలు కాంగ్రెస్, జేడీఎస్ నేతల్లో కలవరం నింపాయి. ఈ విషయాలన్నీ తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి శివకుమార్ వెంటనే అసెంబ్లీకి వెళ్లారు. జరుగుతున్న పరిణామాలపై ఆరా తీస్తున్నారు. కర్నాటక సంకీర్ణ సర్కార్ సంక్షోభంలో ఉందనే వార్తలతో.. పార్టీల బలబలాలపై చర్చలు మొదలయ్యాయి. మొత్తానికి చూస్తే.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీకి మార్గం సుగమైందని కమలనాథులు హ్యాపీ హ్యాపీగా ఉన్నారు.
అసలేంది ఈ కథ..!
కాగా.. కర్నాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ కన్నా బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి మొత్తం 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 37మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 113 మాత్రమే.
మొత్తం ఎమ్మెల్యేలు : 224
జేడీఎస్ ఎమ్మెల్యేలు : 37
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు : 78
బీజేపీ ఎమ్మెల్యేలు : 105
బీఎస్పీ : 01
ఇతరులు : 02
సభలో మెజార్టీ : 113
అయితే ఇప్పటికే రంగంలోకి దిగిన శివకుమార్.. ఎమ్మెల్యేల రాజీనామా పత్రాలను చింపేసినట్లుగా సమాచారం. అయితే దీనిపై అధికారికంగా తెలియాల్సి ఉంది. ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగారు కనుక పరిస్థితి అంతా సర్దుకుంటుందని.. ఎలాంటి టెన్షన్ అవసరం లేదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. పరిస్థితి ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే మరి.