Vijayawada CP:ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్.. విజయవాడ సీపీగా ఎవరంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పీహెచ్‌డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి సీఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల క్రితం నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వీరి స్థానంలో అధికారుల భర్తీ కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున పేర్లను పంపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీంతో నిఘా అధిపతి పోస్టుకు రైల్వే ఏడీజీ కుమార విశ్వజీత్, ఏపీఎస్పీ ఏడీజీ అతుల్ సింగ్, సీఐడీ ఏడీజీ సంజయ్ పేర్లు ప్రభుత్వం పంపింది. వాటిని పరిశీలించిన ఈసీ గతంలోనూ ఎన్నికల సమయంలో నిఘా అధిపతిగా వ్యవహరించిన కుమార విశ్వజీత్‌ను ఎంపిక చేసింది. అలాగే విజయవాడ సీపీ పోస్టుకు రవాణా శాఖ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా, ఏసీబీ డైరెక్టర్ పీహెచ్‌డీ రామక్రిష్ణ, టెక్నికల్ సర్వీసెస్ ఐజీ ఎస్.హరికృష్ణ పేర్లు ప్రభుత్వం పంపించగా.. పీహెచ్‌డీ రామకృష్ణను ఎన్నికల సంఘం నియమించింది. ఈసీ ఆదేశాలతో వీరు ఇప్పటికే తమ విధుల్లో చేరారు.
కుమార్ విశ్వజిత్ 1994వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం రైల్వే విభాగం అదనపు డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఈయన్నే నిఘా విభాగాధిపతిగా ఈసీ నియమించింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా నాలుగైదు నెలల పాటు అదే పోస్టులో కొనసాగారు. అనంతరం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీగా, ఏసీబీ డీజీగా పనిచేశారు.
ఇక 2001 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పీహెచ్‌డీ రామకృష్ణ గతంలో చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. చిత్తూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసిన సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. అలాగే నిఘా విభాగంలోనూ, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధిపతిగానూ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్నారు.
కాగా ఇటీవల విజయవాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధ బస్సు యాత్ర సమయంలో ఆయనపై రాయి దాడి ఘటన తీవ్రం కలకలం రేపింది. ఈ ఘటనను ఈసీ చాలా సీరియస్‌గా తీసుకుంది. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నివేదిక ప్రకారం ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments