'కుడి ఎడమైతే' వెబ్ సిరీస్ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ ఓటిటి సంస్థ ఆహాలో ఒరిజినల్ వెబ్ సిరీస్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. తాజాగా నేడు ఆహా మరో వెబ్ సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. టైటిల్ తోనే ఆసక్తిరేపిన వెబ్ సిరీస్ 'కుడి ఎడమైతే'. క్రేజీ హీరోయిన్ అమలాపాల్, డెబ్యూ నటుడు రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో ఈ వెబ్ సిరీస్ లో నటించారు. మరి కుడి ఎడమైతే ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఆది(రాహుల్ విజయ్) డెలివరీ బాయ్ గా పనిచేస్తూ ఎప్పటికైనా నటుడు కావాలని కలలు కంటుంటాడు. దుర్గ(అమలాపాల్) సిన్సియర్ పోలీస్ అధికారి. ఆమె సిఐ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటుంది. వీరిద్దరికి పరిచయం ఉండదు. కానీ ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు విచిత్రమైన టైం లూప్ లో ఇరుక్కుపోతారు.
వారి జీవితంలో ఫిబ్రవరి 29 పలుమార్లు రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆరోజు జరిగే ఊహించని సంఘటనలు వారిద్దరిని వ్యక్తిగతంగా, వృత్తి పరంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాహుల్ విజయ్ డెలివరీ బాయ్ గా కొన్ని సంఘటనలు ఎదుర్కొంటుంటాడు.
అలాగే అమలాపాల్ సిఐ గా ఓ మిస్టీరియస్ కిడ్నాప్ కేసుని ఛేదించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాగే ఓ యువతి జీవితాన్ని రక్షించే భాద్యత కూడా అమలాపాల్ పై పడుతుంది. ఇలాంటి తరుణంలో రాహుల్ విజయ్, అమలాపాల్ కలుస్తారు. వారికి సిచ్యుయేషన్ ఏంటో అర్థం అవుతుంది.
ఈ విచిత్ర పరిస్థితి నుంచి బయట పడేందుకు ఒకరికి ఒకరు సాయం అందించుకోవాల్సి వస్తుంది. ఈ ప్రయత్నంలో వారిద్దరూ సక్సెస్ అయ్యారా ? టైం లూప్ నుంచి బయట పడ్డారా ? ఆ యువతి జీవితం ఏమైంది ? మిస్టీరియస్ కిడ్నాప్ వెనుక జరుగుతున్న తతంగం ఏంటి ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగిలిన కథ.
విశ్లేషణ:
సస్పెన్స్ అంశాలని, టైం లూప్ అనే కొత్త కాన్సెప్ట్ ని చక్కగా అమర్చిన వెబ్ సిరీస్ కుడి ఎడమైతే. క్రైమ్ అంశాలని సాధారణంగా మెడికల్ మాఫియా తోనో, డ్రగ్ మాఫియా తోనో లింక్ పెడుతూ గతంలో వచ్చిన అనేక కథలని చూశాం. వాటితో పోల్చుకుంటే కుడి ఎడమైతే చాలా చక్కగా డీల్ చేయబడిన భిన్నమైన కథ అని చెప్పొచ్చు.
టైం లూప్ అంశం కాస్త తికమక పెట్టె విధంగా ఉన్నప్పటికీ నెమ్మదిగా కథలో ప్రేక్షకులని ఇన్వాల్వ్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ప్రేక్షకులని కట్టిపడేసే బాధ్యతని అమలాపాల్, రాహుల్ విజయ్ తీసుకున్నారు.
రాహుల్ విజయ్ పాత్రని, అమలాపాల్ రోల్ ని దర్శకుడు ప్రేక్షకుల మైండ్ లో ఫిక్స్ చేయడానికి కాస్త టైం తీసుకున్నప్పటికీ ఆ తర్వాత బాగా కనెక్ట్ అయిపోతారు. కథ పరంగా సన్నివేశాలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ప్రేక్షకులు బోర్ ఫిలయ్యే ప్రమాదం ఉంది. కానీ టైం లూప్ కాన్సెప్ట్ తో చాలా తెలివిగా ప్రతి సన్నివేశాన్ని డీల్ చేశారు.
ఒకసారి జరిగిన సంఘటనే రెండవసారి ఎలా జరుగుతుంది అనే ఉత్కంఠని ప్రేక్షకుల్లో కలిగించారు. అమలాపాల్, రాహుల్ విజయ్ పాత్రలే ఈ చిత్రానికి ప్రధాన బలం. మిగిలిన పాత్రలు వారి వారి స్థాయిల్లో కథకు సపోర్ట్ ఇచ్చాయి. విలన్ రోల్ లో కావలసినంత మసాలా లేదనే చెప్పాలి. రిపీట్ అయినట్లు అనిపించే కొన్ని సన్నివేశాలు, ఉండాల్సినంత బలంగా లేని క్లైమాక్స్, గ్లామర్ అంశాలు పూర్తిగా లేకపోవడం కొద్దిగా మైనస్ అనే చెప్పాలి. చివర్లో వచ్చే ట్విస్ట్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే తరహాలో ప్లే చేసిన టెక్నిక్ లాగా అనిపిస్తుంది.
నటీనటులు:
ముందుగా చెప్పినట్లుగా సిఐ పాత్రలో అమలాపాల్, డెబ్యూ నటుడే అయినప్పటికీ రాహుల్ విజయ్ ఇరగదీశారు. అమలాపాల్ పాత్రకు కొంత బోల్డ్ టచ్ కూడా ఉంది. డిప్రెషన్ కు గురవుతూనే.. బాధ్యతలని విస్మరించని పోలీస్ అధికారిగా అమలాపాల్ నటన అద్భుతంగా ఉంటుంది. మనం గ్లామర్ కమర్షియల్ చిత్రాల్లో చూసిన అమలాపాల్ కి.. సిఐ దుర్గగా నటించిన అమలాపాల్ కి కంప్లీట్ చేంజ్ కనిపిస్తుంది.
ఇక రాహుల్ విజయ్ కూల్ గా అదరగొట్టేశాడు. అతడు కథకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అవసరమైన ప్రతిసందర్భంలోనూ వేరియేషన్స్ పండించాడు. ఇక విలన్ పాత్రలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవి ప్రకాష్ పాత్ర పరిమితంగా అనిపిస్తుంది. అతడికి పూర్తిస్థాయిలో నటించే స్కోప్ దక్కలేదు. విలన్ పాత్రకు అవసరమైన హంగులు కూడా రవి ప్రకాష్ లో కనిపించలేదు.
సాంకేతికంగా:
దర్శకుడు పవన్ కుమార్ ఫుల్ మర్క్స్ కొట్టేశారు. సినిమా మొత్తం ఒకే తరహాలో ఉంటుందని తెలిసినప్పటికీ.. కథనంపై నమ్మకం ఉంచారు. నటీనటుల నుంచి కావలసిన పర్ఫామెన్స్ ని రాబట్టుకుని ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఎలా ఉండాలో అలా పక్కాగా ఎగ్జిక్యూట్ చేశాడు.
డైలాగులు బావున్నాయి. ఇక బ్యాగ్రౌండ్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ తరహా కథకు కావలసిన సంగీతం పర్ఫెక్ట్ గా సింక్ అయిందని చెప్పొచ్చు. వెబ్ సిరీస్ మొత్తం ఒక సిగ్నేచర్ స్టైల్ లో సరికొత్త బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు.
ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బావున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి పెద్ద పెద్ద సెట్టింగులు ఎక్కడా అవసరం ఉండవు. అయినా వెబ్ సిరీస్ మొత్తం రిచ్ విజువల్స్ మైంటైన్ చేశారు. సినిమాటోగ్రాఫర్ పనితనం కూడా బావుంది.
ఫైనల్ పంచ్:
అమలాపాల్, రాహుల్ విజయ్ బ్రిలియంట్ పెర్ఫామెన్స్, టైం లూప్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన కుడిఎడమైతే వెబ్ సిరీస్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఈ వీకెండ్ లో ఈ వెబ్ సిరీస్ చూడడం ద్వారా మీరు సంతృప్తి పొందుతారు.
రేటింగ్: 3/5
Read 'Kudi Yedamaithe' Web Series Review in English
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments