ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి శోభానాయుడు ఇక లేరు..

  • IndiaGlitz, [Wednesday,October 14 2020]

కూచిపూడి నాట్య కళాకారిణి శోభానాయుడు(58) మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు.
శోభానాయుడు నెల రోజులుగా న్యూరాలజీ సమస్యతో బాధపడుతున్నారు. 12 ఏళ్ల వయసులోనే కూడిపూడిలో శోభానాయుడు అరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. అప్పటి నుంచి ఆమె పలు షోలు ఇచ్చారు.

శోభానాయుడు వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1956లో జన్మించారు. సత్యభామ, పద్మావతి పాత్రల్లో శోభానాయుడు రాణించారు. హైదరాబాద్‌ కూచిపూడి ఆర్ట్స్ అకాడమీకి ప్రిన్సిపల్‌గా పనిచేశారు. 2001లో పద్మశ్రీ పురస్కారంతో పాటు పలు అవార్డులు ఆమె ప్రతిభకు తార్కాణంగా నిలిచాయి. హైదరాబాద్‌లో కూచిపూడి నాట్య అకాడమీని ప్రారంభించి 40 వేలకు మందికి పైగా నాట్యాన్ని నేర్పించారు.

నెలరోజుల క్రితం ఇంటిలో జారిపడటంతో ఆమె తలకు స్వల్ప గాయమైంది. అప్పటి నుంచి శోభా నాయుడు ఆర్థో న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆమెకు కరోనా కూడా సోకింది. పది రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఆమెకు కరోనా ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. చికిత్స పొందుతూనే నేడు ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్త విని శిష్యులంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.