చంద్రబాబు పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్...

  • IndiaGlitz, [Monday,February 25 2019]

తెలంగాణ ఎన్నికలు అయిపోయినప్పటికీ ఇంకా ఏపీ సీఎం చంద్రబాబు, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ఆగట్లేదు. బహుశా ఇప్పట్లో ఆగే.. ఆపే పరిస్థితుల్లో అటు టీడీపీ.. ఇటు టీఆర్ఎస్ నేతలు లేరనే చెప్పుకోవచ్చు. ఇటీవల మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. టీడీపీ వంద శాతం ఓడిపోతుందని.. వైసీపీ గెలవబోతోందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి టీడీపీ వర్సెస్‌‌ టీడీపీగా పరిస్థితులు మారిపోయాయి. ఈ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్‌ సీఎం అవుతాడని కేటీఆర్‌ అంటున్నారని.. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌, వైఎస్ ‌జగన్‌ కుట్రలు ఆంధ్రప్రదేశ్‌లో సాగవని ఆయన హెచ్చరించారు. వాళ్లకు చేతనైతే అభివృద్ధిలో తనతో పోటీ పడాలని కేటీఆర్‌తో పాటు కేసీఆర్‌‌కు కూడా సవాల్ విసిరారు. అయితే ఈ వ్యాఖ్యలకు తాజాగా మరోసారి కేటీఆర్ రియాక్టయ్యారు. దేవరకద్రకు చెందిన పలువురు స్థానిక నేతలు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్‌‌.. చంద్రబాబు, రాహుల్, మోదీపై నిప్పులు చెరిగారు.

చంద్రబాబుపై కేటీఆర్ చండ్రనిప్పులు..!

చంద్రబాబు దుర్మార్గపు పాలన పోవాలని అక్కడి (ఏపీ) ప్రజలు కోరకుంటున్నారు. ఎవరితో ఒకరితో పొత్తు లేకుండా చంద్రబాబు బతకలేరు. చంద్రబాబుకు, కేసీఆర్‌‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబుకు రైతులు గుర్తొచ్చారు. మమ్మల్ని తిడుతూనే అటు ఆంధ్రప్రదేశ్‌‌లో.. ఇటు కేంద్రంలో పథకాలను కాపీ కొడుతున్నారు. మన రైతుబంధును కాపీ కొట్టి ‘అన్నదాతా సుఖీభవా’ అని మార్చుకున్నారు. ఇన్ని రోజులు అన్నదుఖీ: భవా.. ఇప్పుడు సుఖీభవా అంటూ గింగిరాలు కొడుతున్నారు. ఇక్కడ మనం కల్యాణ లక్ష్మి అని ఇస్తుంటే పసుపుకుంకుమ అని పథకం పెట్టిండు. అన్నపూర్ణ మనం క్యాంటీన్లు పెడితే ఆయనక్కడు అన్నా క్యాంటీన్లు అని పేరు పెట్టారు. అన్నీ కాపీ కొట్టుడే కానీ బయటికి చెప్పేందుకు సిగ్గొస్తోంది.

ఏమ్.. మేం తెలుగోళ్లం కాదా..!

రండి చూస్కుందాం తెలుగోడి సత్తా ఏంటో చూపుతాం అంటున్నారు అంటే తెలంగాణలో తెలుగోళ్లు లేరా..?. తెలంగాణలో నాలుగు కోట్ల మంది తెలుగోళ్లం ఉన్నాం..మొన్ననే (ఎన్నికలప్పుడు) ఇక్కడికొస్తే మీ వీపు పగలకొట్టి పంపించినం. కుట్రలు, కుతంత్రాలు, ముసుగు రాజకీయాలు మాకు చేతగావ్.. మేం తెలంగాణోళ్లం సీదాగా ఉంటాం. ఉన్నది ఉన్నట్లు మనసులో ఉండేదే బరాబర్ చెబుతాం. కుత్రలు, కుతంత్రాలు, చీకటి దోస్తానాలు వీటన్నింటికీ పేటెంట్ ఏదైనా ఉన్నదా అంటే ఒకే ఒక్కడు చంద్రబాబు. ఈ పేరు మీకుంది తప్ప మాకు లేదు అని చంద్రబాబుపై స్ట్రాంగ్ కౌంటర్లు పేల్చారు.

నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా...

కేసీఆర్ చెట్లు నాటించిన చక్రవర్తి... మీరేమో రోమ్ తగలబడుతుంటే పిడేల్ వాయించకునే నీరో చక్రవర్తివి నువ్వు. మీకు.. కేసీఆర్‌‌కు నక్కకూ నాగలోకానికున్నంత తేడా ఉంది. కేసీఆర్ సొంతంగా ఒక పార్టీ పెట్టుకుని ఆ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది కేసీఆర్. మరి మీరు మామ పెట్టిన పార్టీలో చేరి.. చీమలుపెట్టుకున్న పుట్టలో పాము దూరినట్లు మామను వెనకటికి తోసి పార్టీని గుంజుగుంటివి. అప్పట్నుంచి ఇప్పటి వరకూ ఏ ఒక్క పార్టీతో పొత్తు పెట్టకుండా ఏనాడైనా ఎన్నికలకెళ్లావా..? బతుకలేకపోయా.. స్వయం ప్రకాశం లేకపోయా..? మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు దుర్మార్గపు పాలన అంతం కావాలని ఏపీ ప్రజలే అనుకుంటున్నారు. బాబుగారు పోతేనే జాబులొస్తాయని వాళ్లందరికీ అర్థమైంది అందుకే వాళ్లందరూ తప్పకుండా వాళ్ల పని వాళ్లు చేస్తారు మన పని మనం చేద్దాం.. మనమేం అక్కడికి పోనక్కర్లేదు అని చంద్రబాబుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

మొత్తం కాపీ పేస్టే..!

అటు చంద్రబాబు నాయుడు.. ఇటు రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీ అందరూ ఏం చేయాలా.. అని తలకాయలు పట్టుకుంటున్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల మనసును ఎలా గెలుచుకున్నారు.. రైతులను ‘రైతుబంధు’ పథకం ద్వారా ఎవరూ చరిత్రలో చేయలేని పథకంతో రైతన్నల మనసులను గెలుచుకున్నారని వాళ్లకు స్పష్టంగా అర్థమైంది. కానీ బయటికి చెప్పేందుకు అహంకారం అడ్డొస్తోంది. అందుకే మనం ‘రైతు బంధు’ అని పెడితే ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన’ అని పేరుమార్చి అదే పథకాన్ని మోదీ కాపీ కొట్టారు. నో ప్రాబ్లమ్.. దేశంలో రైతులకు మంచి చేస్తున్నారు కాబట్టి మనకూ మంచిదే అని కేటీఆర్ తెలిపారు.

ఢిల్లీని గడగడలాడించి..

కేంద్రం మెడలు వంచి నిధులు తెచ్చే సత్తా కేసీఆర్‌కు ఉంది. మోదీకి బిల్డప్ ఎక్కువ.. చేసేది తక్కువ. కాంగ్రెస్, బీజేపీ కలిసినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడదు. మోదీ, రాహుల్ పట్ల ప్రజలు సంతృప్తిగా లేరు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ తప్ప వేరే పార్టీలే లేవా..? దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా. 16 ఎంపీ స్థానాలు గెలిపిస్తే ఢిల్లీని శాసించొచ్చు. ఎంపీ సీట్లతో తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ అని, రేపు 16 ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ ను గెలిపిస్తే, ఢిల్లీని గడగడలాడించి మనం అడిగింది ఇచ్చేట్లు కేసీఆర్ చేస్తారు. ఇలాంటి తరుణంలో ఒక్క ఎంపీ సీటు కూడా కీలకమే అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలపై టీటీడీపీ.. ఏపీ టీడీపీ నేతల నుంచి.. ముఖ్యంగా చంద్రబాబు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.

More News

ఆర్టిస్టుల‌కు 'గోల్డేజ్ హోమ్' ఇవ్వ‌డం నా డ్రీమ్‌! - మా అధ్య‌క్షులు శివాజీ రాజా

ప‌రిశ్ర‌మ‌లో మూడు ద‌శాబ్ధాల అనుభ‌వం ఉన్న న‌టుడిగా శివాజీ రాజా సుప‌రిచితం. మూవీ ఆర్టిస్టుల సంఘంలో ప‌లు బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించిన అనుభ‌వ‌జ్ఞుడు.

షాకింగ్: రాజకీయాల్లోకి పవన్ మాజీ భార్య రేణుదేశాయ్..!?

టాలీవుడ్ టాప్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ రాజకీయాల్లోకి వస్తున్నారా..?

పూరి ఇప్పుడు 'డబుల్ ఇస్మార్ట్‌'

హీరోయిజంను స‌రికొత్త‌గా తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో డాషింగ్‌డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్‌కు ప్ర‌త్యేక‌మైన శైళి ఉంది.

సెన్సార్ కార్యక్రమాల్లో 'సువ‌ర్ణ‌సుంద‌రి'

జయప్రద,  పూర్ణ,  సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం "సువర్ణసుందరి".   సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు.

ఆస్కార్ ద‌క్కించుకున్న భార‌తీయ చిత్రం

ఆస్కార్ అవార్డుల్లో భార‌తీయ సినిమాకు అవార్డు ద‌క్కింది. హీరోయిజం, గ్లామ‌ర్ అనే అంశాల‌కు కాకుండా క‌థ‌కు ప్రాధాన్య‌మిచ్చి రూపొందిన చిత్రం