KTR: సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
- IndiaGlitz, [Tuesday,March 26 2024]
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ తన టీంతో కలిసి బీజేపీలో చేరతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీలో మోదీని చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్ గాంధీ విమర్శిస్తుంటే.. ఇక్కడ మాత్రం ప్రధాని మోదీ బడేభాయ్ అంటూ రేవంత్ రెడ్డి అంటున్నారని తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు అక్రమమని, లిక్కర్ పాలసీ కేసు నకిలీదని ఢిల్లీలో కాంగ్రెస్ విమర్శలు చేస్తుంటే.. తెలంగాణలో కవితను అరెస్టు చేయాలని సీఎం అన్నారని పేర్కొన్నారు.
అక్కడ అదానీ మంచోడు కాదంటే.. ఇక్కడేమో అదానీ మంచోడు అని అంటున్నారని.. అక్కడ రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ దుర్మార్గం అంటే ఇక్కడ మా బడేభాయ్ మోడల్ బాగుందని రేవంత్ అంటున్నారని. కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం లేదని.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి 40 సీట్లు కూడా దాటవని జోస్యం చెప్పారు. మున్సిపల్ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మూడు నెలలుగా ఎందుకు బిల్డింగ్లకు అనుమతులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. డబ్బులు ఇస్తేనే అనుమతులు ఇస్తామని ఢిల్లీకి 2500 కోట్ల రూపాయలు పంపింది నిజం కాదా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లెక్క మాట్లాడటం లేదు జేబులో కత్తెర పెట్టుకొని జేబుదొంగ లెక్క తిరుగుతున్నాడని తీవ్ర విమర్శలు చేశారు.
ఉచిత కరెంటు, రైతుబంధు హామీలు అమలు చేయకుండా ఫోన్ ట్యాపింగ్, స్కాముల అంటూ వార్తలు రాయిస్తున్నారని ఆరోపించారు. అధికారం నీ చేతల్లో ఉంది ఏం చేస్తావో చెయ్.. తప్పులు చేసిన వాళ్ళపై చర్యలు తీసుకో అని సవాల్ చేశారు. అలాగే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలు ఉంటాయని.. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఖతమై పోతారన్నారు. దానం అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఖైరతాబాద్ ప్రజలు తెలుసుకున్నారని తెలిపారు. సికింద్రాబాద్ ఎంపీగా ఆయనను చిత్తుగా ఓడిస్తారు అంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.