ఈటలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి కేటీఆర్!
- IndiaGlitz, [Saturday,May 15 2021]
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను రాజకీయంగా పూర్తిగా దెబ్బకొట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే వ్యూహాలకు పదును పెడుతోంది. చాలా వ్యూహాత్మకంగా ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించిన అధిష్ఠానం ఒకవేళ ఈటల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే తదుపరి పరిణామాలపై దృష్టి సారించింది. ఆ తరువాత పార్టీని హుజూరాబాద్ నియోజకవర్గంలో నిలబెట్టుకోవడం కోసం కసరత్తు ప్రారంభించింది. మరోవైపు ఈటల కూడా తన పనిని తాను సైలెంట్‌గా చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే ఇతర పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలను కలుస్తూ తనకు మద్దతు ఇవ్వమని కోరుతున్నారు. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన తరువాత పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించడంతోపాటు తన పోరాటాన్ని కొనసాగిస్తానని తెలిపారు.
Also Read: రఘురామ అరెస్ట్.. ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటే..
ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ నాయకత్వం హుజూరాబాద్ నియోజకవర్గాన్ని తొలుత టార్గెట్ చేసింది. బర్తరఫ్ సమయంలో ఆయనకు మద్దతుగా నిలిచిన నాయకులను వెనుదిరిగేలా పావులు కదుపుతున్నారు. దీనికి సంబంధించిన పనులన్నింటినీ ప్రస్తుతం కరీంనగర్ జిల్లాకు చెందిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే మండలాల్లోని మెజారిటీ నాయకులను టీఆర్‌ఎస్ వైపు తిప్పడంలో గంగుల కొంతమేర విజయం సాధించారనే చెప్పాలి. ముహుజూరాబాద్‌లో ఐదు మండలాలతోపాటు రెండు మున్సిపాలిటీలున్నాయి. కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ కనుమల విజయ ఈ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం నుంచే జడ్పీటీసీగా గెలిచారు. ముఖ్యంగా ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను ఈటలకు దూరం చేసి ఆయనను మానసికంగా దెబ్బ కొట్టాలని పథకాలు రచిస్తున్నారు. మెజారిటీ ప్రజాప్రతినిధులు తమ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పార్టీకే అండగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుతానికి ఈటలకు చెక్ పెట్టేందుకు అవసరమైన కార్యకలాపాలన్నీ గంగుల కమలాకర్ చూస్తున్నారు. కొవిడ్ ప్రభావం కాస్త తగ్గిన వెంటనే మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గంగుల పార్టీ నేతలు చేజారిపోకుండా చూస్తున్నారు. నేతలతో మాట్లాడి పార్టీలోనే ఉండేలా ఒప్పించారు. అయితే ఈటల వైపు కూడా పలువురు నేతలున్నారు. కేటీఆర్ రంగంలోకి దిగి వారిని కూడా తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తారని తెలుస్తోంది. పార్టీ తరువాతే వ్యక్తులు అన్న విషయాన్ని అక్కడి నేతల మనసుల్లోకి బలంగా జొప్పించేందుకు గంగుల యత్నిస్తున్నారు. కేటీఆర్ సైతం రంగంలోకి దిగితే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని హుజూరాబాద్ మొత్తం కారు నీడలోకి వచ్చేస్తుందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు.