KTR:సిరిసిల్లలో కేటీఆర్‌కు ఓటమి భయం.. ఆడియో కాల్ వైరల్..

  • IndiaGlitz, [Thursday,November 23 2023]

తెలంగాణ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతోంది. ప్రచారానికి ఇంకో ఆరు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీలను బ్యాడ్ చేసేలా వ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్ కార్యకర్తలతో మాట్లాడిన ఓ ఫోన్ కాల్ ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిరిసిల్లలో ఓడిపోతామని కేటీఆర్‌కు భయం చుట్టుకుందని ఈ ఫోన్ కాల్‌లో క్యాడర్‌ను బతిమాలుకుంటున్నారని కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు చేసింది.

ఈసారి ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ముఖ్యంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా సోషల్ మీడియాలో ప్రచారంతో అదరగొడుతోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ ఫోన్‌ కాల్‌ లీక్‌ చేసింది. కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లలో క్యాడర్ ప్రచారానికి వెళ్లాలంటేనే వెనకాడుతున్నారని.. కేటీఆర్ ఓడిపోవడం ఖాయం అంటోంది. అందుకే ఫోన్లు చేసి మరీ బతిమాలుకునే పరిస్థితికి కేటీఆర్‌కు వచ్చారని ఆ పోస్టులో పేర్కొంది.

ఆ ఆడియో కాల్ పరిశీలిస్తే.. ఎన్నికలకు ఇంకో వారం రోజులే ఉందని మళ్లీ వచ్చే మంగళవారానికి ప్రచారం ముగిసిపోతుందని అన్నారు. ఈ లోపు ప్రతి ఒక్క నేత ఇంటింటి ప్రచారం చేయాలని కోరారు. నియోజకవర్గంలో తాను ఓడిపోతానని ఎవరో ఏదో చెబుతున్నారని అలాంటివి పట్టించుకోవద్దని తెలిపారు. బీఆర్ఎస్ నేతల్లోనే పుకార్లు పుట్టించి ప్రచారం చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తల్లోనే పది మంది పది రకాలుగా మాట్లాడుకుంటున్నారని అవన్నీ బంద్‌ చేయాలని పేర్కొన్నారు. దయచేసి ఇలాంటి గాలి మాటలు నమ్మకుండా ప్రచారంపై ఫోకస్ చేయాలని మంత్రి విజ్ఞప్తిచేస్తున్నారు. దీంతో కేటీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.