కేటీఆర్ దెబ్బకు వెనక్కి తగ్గిన.. గులాబీ నేతలు!?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో రెండోసారి కేబినెట్ విస్తరణ జరిగిన తర్వాత పలువురు మంత్రిపదవులు వరిస్తాయని ఆశపడి.. రాకపోవడంతో అడ్రస్ లేకుండా పోవడం.. గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో ముఖ్యంగా సీనియర్ నేతలు, మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీరిద్దరే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు.
మంత్రి పదవి దక్కలేదని.. కేసీఆర్ మోసం చేశారని నాయిని వ్యాఖ్యానించగా.. జోగు రామన్న మాత్రం అడ్రస్ లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లడం ఇలా వరుస ఘటనలతో కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్లో నంబర్-2 అయిన మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. దీంతో అసంతృప్తులంతా దెబ్బకు వెనక్కి తగ్గారని తెలుస్తోంది. అందుకే.. వాళ్లంతకు వాళ్లుగా మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది.
నాయిని విషయానికొస్తే...
తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారని.. హోం మంత్రిగా పని చేసిన తాను ఛైర్మన్ పదవులను ఎలా తీసుకుంటానని గులాబీ సర్కార్ను నాయిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే ఒక్కరోజు వ్యవధిలో ఏం జరిగిందో ఏమోగానీ దెబ్బకు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవడమే కాకుండా మీడియానే దోషిగా చూపడం గమనార్హం.
నాయిని తాజాగా ఏమన్నారు!?
నాపై వచ్చిన వార్తలపై మంత్రి కేటీఆర్ నన్ను అడిగారు. మీడియాతో ఏదో చిన్నగా చిట్ చాట్ చేస్తే... పెద్ద వార్తగా రాసేశారు. సీఎం కేసీఆర్ పిలిస్తే వెళ్లి నేను మాట్లాడతాను. టీఆర్ఎస్ పార్టీ మాదే.. అందులో ఉన్న పదవులు కూడా మాకే వస్తాయి. ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చినా అందులో వారే రసం పోస్తారు’ అని ముందు మాట్లాడిన మాటలను కాసింత సమర్థించుకుంటూ నాయిని మాట్లాడారు.
ఇక జోగురామన్న విషయానికొస్తే..!
మంత్రి పదవి వస్తుందని వేయి కళ్లతో వేచి చూసిన జోగు రామన్న.. రాకపోవడంతో అడ్రస్ లేకుండా పోయారు. దీంతో ఆయన నియోజకవర్గంలో కార్యకర్తలు, అనుచరులు పెద్ద హంగామానే చేశారు.. అంతేకాదు.. ఆయన గన్మెన్లను కూడా వదలేసి వెళ్లిపోవడంతో అసలేం జరిగింది..? ఆయన ఏమయ్యాడు..? అని అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన.. ‘అబ్బే అదేం లేదు.. నేను బాగున్నా’ అని చెప్పడం గమనార్హం.
రామన్న ఏమన్నారంటే..!
‘నేను అనారోగ్య కారణంగానే అందుబాటులో లేను. మంత్రి పదవి ఇస్తారనే ఆశ ఉన్న మాట మాత్రం వాస్తవమే.. అది దక్కకపోవడంతో మనస్థాపానికి గురయ్యాను. బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరానే తప్ప అజ్ఞాతంలోకి వేళ్లే అవసరం నాకు లేదు. సర్పంచ్ స్థాయి నుంచి మచ్చలేని వ్యక్తిగా ఉన్న నాకు మంత్రి పదవి రాకపోవడం బాధ కలిగించింది.. ’ అని మీడియా ముందు రామన్న కంటతడి పెట్టారు. ఇదిలా ఉంటే.. తనకు మంత్రి పదవి రాకున్నా టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానే తప్ప వేరో పార్టీలో చేరనని స్పష్టం చేశారు.
మొత్తానికి చూస్తే.. కేటీఆర్ దెబ్బకు ఈ ఇద్దరు మాత్రం వెనక్కి తగ్గి మీడియా ముందుకు వచ్చారని స్పష్టంగా తెలుస్తోంది.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని చెప్పుకోవచ్చు. కాగా మిగిలిన నేతలు కూడా వీరిద్దరి బాటలోనే అలక మాని వస్తారో లేదో వేచి చూడాలి మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout