సీఎం రేవంత్ రెడ్డి గురించి కేటీఆర్ ట్వీట్ వైరల్.. ఏమన్నారంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. సుమతి శతకంలో బద్దెన రాసిన 'కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టిన శుభ లగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణ మేలమాను? వినురా సుమతీ' అనే పద్యాన్ని షేర్ చేశారు. దీనికి'పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారు' అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్ ట్వీట్‌పై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. సీఎం కుర్చీకి కేటీఆర్ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఫైర్ అవుతున్నారు.
ఇక తెలంగాణ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇదే పద్యాన్ని మరోసారి ప్రస్తావించారు. ఇప్పటికీ తామే అధికారంలో ఉన్నట్లుగా.. కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నట్లుగా వారు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అహంకారంతో కాంగ్రెస్ నేతలు వ్యక్తిగతంగా ఎంత దూషించినా.. హామీలు అమలు చేసే వరకూ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
అలాగే గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను తమ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే.. రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాంను ఎమ్మెల్సీగా ఎలా ఆమోదిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాగానే ఆగమేఘాల మీద ఎలా సంతకం చేశారో గవర్నర్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు.
కాగా కొంతకాలంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల నేతలు పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తనను గుంపు మేస్త్రీ అంటూ గులాబీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. "అవును నేను మేస్త్రీనే.. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్మించిన మేస్త్రీనే అని కౌంటర్ ఇచ్చారు. మిమ్మల్ని గోరి కట్టే మేస్త్రీని నేనే.. బిడ్డల్లారా కాస్కోండి" అని హెచ్చరించారు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార, విపక్ష నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments