అత్యాచార ఆరోపణలపై కృష్ణుడు ఏమన్నారంటే..
- IndiaGlitz, [Saturday,August 29 2020]
తనపై 139 మంది అత్యాచారం జరిపారంటూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సెలబ్రిటీల లిస్టులో యాంకర్ ప్రదీప్‌తో పాటు నటుడు కృష్ణుడు పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. దీనిపై ఇప్పటికే యాంకర్ ప్రదీప్ రియాక్ట్ అవ్వగా.. కృష్ణుడు తాజాగా వివరణ ఇచ్చారు. తను ఎవ్వరినీ కలవలేదని.. ఎవ్వరికీ అన్యాయం చేయలేదన్నారు.
తనపై అత్యాచార ఆరోపణలు రావడంతో షాకయ్యానన్నారు. తనకు ఎలాంటి దురలవాట్లు లేవన్నారు. మందు, సిగరెట్ తాగనని.. పబ్‌లకు వెళ్లనని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆరోపణలు రాగానే ఆ విషయాన్ని తన భార్యకు చెప్పానన్నారు. ఆమె తనకు సపోర్ట్‌గా నిలిచిందన్నారు. ఒకరిపై ఆరోపణలు చేసే ముందు వారి కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో చూడాలన్నారు. లాక్డౌన్ సమయంలో తనకు ఏ ఫోన్ కాల్ రాలేదన్నారు.
అయితే నల్గొండ నుంచి ఓ అమ్మాయి ఫోన్ చేసిన మాట వాస్తమేనన్నారు. తాను ఆమెతో తప్పుగా ఏమీ మాట్లాడలేదన్నారు. అయితే ఆమె మాటతీరు అనుమానాస్పదంగా ఉండడంతో కాల్ కట్ చేసి, ఆ వెంటనే బ్లాక్ కూడా చేశానని కృష్ణుడు వెల్లడించారు. తనది ప్రేమ వివాహమని... ఓ కూతురు కూడా ఉందన్నారు. తాను మహిళలకు ఎంత గౌరవం ఇస్తానో ఇండస్ట్రీలో అందరికీ తెలుసన్నారు. ఈ వ్యవహారం వెనుక ఎవరో ఉన్నారని అర్థమవుతోందని... తనపై ఆరోపణలు చేసే వాళ్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని కృష్ణుడు వెల్లడించారు.