`జెండాపై కపిరాజు`, `జెంటిల్ మన్` చిత్రాల తర్వాత నాని ద్విపాత్రాభినయం చేసిన సినిమా `కృష్ణార్జున యుద్ధం`. కృష్ణ, అర్జున్ అనే విభిన్నమైన మనస్తత్వాలు, ఒకే విధమైన రూపు ఉండే ఇద్దరు యువకులు ఓ సందర్భంలో తమకు కావాల్సినది దక్కించుకోవడానికి కలిసి చేసిన పోరాటమే ఈ చిత్రం. ఆసక్తికరమైన విషయమేమంటే.. కృష్ణార్జున యుద్దం` నానికి ట్రిపుల్ హ్యాట్రిక్ మూవీ కానుంది. ఇప్పటికే ఎనిమిది వరుస విజయాలు సాధించిన నానికి ఈ సినిమా హిట్ అయితే తొమ్మిదో సక్సెస్ వచ్చినట్లే. మరి హీరోగా నాని ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించాడా? లేదా? నాని వరుస విజయాలకు బ్రేక్ పడిందా? అని తెలుసుకోవాలంటే సినిమా కథలోకి ఓ లుక్కేద్దాం మరి!.
కథ:
కృష్ణ(నాని) చిత్తూరు జిల్లా అక్కుర్తి గ్రామం.. అర్జున్(నాని)ది యూరప్‌లోని ప్రాగ్ నగరం. కృష్ణ తన గ్రామంలోని అమ్మాయిలందరికీ ప్రపోజ్ చేస్తూ పోకిరి అని పేరు తెచ్చుకుంటాడు. ఎవరి మాట సరిగా వినడు. తనకు నచ్చిందే చేస్తుంటాడు. అర్జున్ రాక్ స్టార్. స్టేజ్‌షోలతో అందరి మనసులను దోచుకునే అర్జున్ ప్లేబోయ్. ఎంతో మంది అమ్మాయిలతో తిరుగుతుంటాడు. కృష్ణ తన ఊరి సర్పంచ్(నాగినీడు) మనవరాలు రియా(రుక్సర్ మీర్)ను ప్రేమిస్తాడు. ఆమె కూడా కృష్ణ మంచితనం నచ్చి అతన్ని ప్రేమిస్తుంది. వీరి ప్రేమ వ్యవహారం నచ్చిన ఆమె తాతయ్య ఆమెను హైదరాబాద్ పంపేస్తాడు. కానీ రియా హైదరాబాద్‌కు చేరుకుంటుంది. కానీ ఎవరో ఆమెను కిడ్నాప్ చేస్తారు. అర్జున్ ఓ మాగజైన్‌లో కవర్‌పేజీ ఫోటోలు కోసం వచ్చిన ఫోటోగ్రాఫర్ సుబ్బలక్ష్మి(అనుపమ పరమేశ్వరన్)ను ప్రేమిస్తాడు. అర్జున్ ప్లేబోయ్ అన్న సంగతి తెలుసుకున్న సుబ్బలక్ష్మి అతన్ని ప్రేమించదు. కానీ సుబ్బలక్ష్మి కోసం అర్జున్ మారిపోతాడు. ఈలోపు సుబ్బలక్ష్మి హైదరాబాద్ బయలుదేరుతుంది. ఎయిర్‌పోర్టులో దిగిన సుబ్బలక్ష్మిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. రియాను వెతుక్కుంటూ కృష్ణ, సుబ్బలక్ష్మిన వెతుక్కుంటూ అర్జున్ హైదరాబాద్ చేరుకుంటారు. వారికి తెలిసే నిజం ఏమిటి? ఇద్దరూ తమ ప్రేయసిలను కలుసుకున్నారా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు ప్రధాన బలం నాని నటన.. ఒక పక్క చిత్తూరు జిల్లా యాసలో.. విలేజ్ కుర్రాడిగా ఆకట్టుకోవడమే కాదు.. రాక్‌స్టార్ అర్జున్‌గా రాకింగ్ చేశాడు. అయితే అర్జున్ పాత్ర కంటే కృష్ణ పాత్ర ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతుంది. రెండు పాత్రలను నాని బాగా బాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. చిత్తూరుజిల్లా యాసలో నాని పండించిన కామెడీ కొత్తగా ఉంది. ప్రేక్షకులను మెప్పిస్తుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ సినిమాలో కాంప్లికేటెడ్ కథ ఉండదు. అతను స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకుంటాడు. ఈ సినిమాలో కూడా అదే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కృష్ణ, అర్జున్ పాత్రలను వారి సన్నివేశాలన మిళితం చేసిన తీరు బావుంది. ఇక సెకండాఫ్ అంతా అసలు కృష్ణ, అర్జున్‌లు ఎందుకు పోరాడారనేది రేసీగా చూపించాడు. `దారి చూడు దుమ్ము చూడు...`, `ఐ వాంట్ టు ఫ్లై..`, `ఎగిరే...` పాటలు బావున్నాయి. హిప్ హాప్ తమిళ అందించిన ట్యూన్స్.. పిక్చరైజేషన్.. నేపథ్య సంగీతం ఆకట్టకుంటాయి. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రపీ మరో ఎసెట్ అవుతుంది. సినిమాలో బ్రహ్మాజీ, నాగినీడు, ప్రభాస్ శీను, హరితేజ, విద్యుల్లేఖా రామన్, దేవదర్శిని తదితరులు వారి పాత్రల మేర చక్కగా నటించారు.
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్‌కు దూరంగా సెకండాఫ్ కామెడీకి చాలా దూరంగా రేసీగా ఉండటం. అప్పటి వరకు కామెడీని ఎంజాయ్ చేసిన ప్రేక్షకుడు సెకండాఫ్‌లో కామెడీని ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. కానీ సినిమా స్పీడు యాక్షన్ పార్ట్‌తో సాగుతుంది. క్లైమాక్స్ సాగదీతగా ఉంది. కథలో కొత్తదనం ఏమీ కనపడదు. రాక్‌స్టార్ పాత్రలో నాని ఓకే అనిపించాడంతే..
విశ్లేషణ:
సినిమాలో ఏదో ఒక మెసేజ్ అనేది కామన్‌గా ఉంటుంది. ఈ సినిమాలో హ్యుమన్ ట్రాఫికింగ్ అనేది ఎలా ఉంటుంది. దాని వల్ల అమ్మాయిలు ఎలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారనేది టచ్ చేశారు. సెకండాఫ్ అంతా సినిమా ఆ పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. అసలు మెయిన్ కథ ప్రారంభమైయ్యేదే అక్కడే. ఇలాంటి ఓ పాయింట్‌ను సీరియస్‌గా చెబుతూ దానికి కామెడీ టచ్ ఇచ్చి తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్టాఫ్‌ను పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో 90 నిమిషాలు ఉండేలా చూసుకున్నాడు. ఇక సీరియస్‌గా సాగే కథనం 60 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇలాంటి చిన్న జాగ్రత్తలు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక బ్రహ్మాజీ, దేవదర్శిని మధ్య వచ్చే సంగీతం కామెడీ సన్నివేశాలు.. కృష్ణ కోసం అర్జున్ తన డబ్బునంతా ఖర్చు పెట్టేయడం.. కృష్ణకు ఏదైనా ఓ బ్యాగ్రౌండ్ సాంగ్ వినిపించి.. దానికి ఏదో కారణాన్ని చూపించడం.. వంటివే బానే ఉన్నాయి. సెకండాఫ్ గంట పాటే అయినా సాగదీతగా అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ మరి పెద్దదిగా అనిపించింది. నిర్మాణ విలువలు బావున్నాయి.
బోటమ్ లైన్: కృష్ణుడు మెప్పించాడు
Comments