Krishnam Raju: రేపు మొయినాబాద్ ఫాంహౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు.. ముమ్మరంగా ఏర్పాట్లు
Send us your feedback to audioarticles@vaarta.com
అనారోగ్యంతో మరణించిన దిగ్గజ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని కనకమామిడి ఫామ్ హౌస్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య జరగనున్నాయి. కృష్ణంరాజు మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఆయన పార్ధివదేహానికి నివాళులర్పించి, రెబల్ స్టార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు నివాసం ప్రముఖులు, అభిమానులతో కిటకిటలాడింది.
ఇదీ ప్రస్థానం :
1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. విద్యాభ్యాసం తర్వాత సినిమాలపై ఆసక్తితో ‘చిలకా గోరింకా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అవేకళ్లు చిత్రంలో విలన్‌గా నటించి తన నటనతో మెప్పించారు. రెండు నంది అవార్డులు, ఒక ఫిల్మ్ ఫేర్ , ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవన సాఫల్య పురస్కారం వరించింది. బొబ్బిలి బ్రహ్మన్న, భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు, కటకటాల రుద్రయ్య, అమరదీపం, సతీ సావిత్రి, పల్నాటి పౌరుషం, తాతా మనవడు, టూ టౌన్ రౌడీ వంటి సినిమాలు విశేష ప్రజాదరణ పొందాయి. అలనాటి అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబులతో సమానంగా కృష్ణంరాజుకు అభిమాన గణం వుండేది. హీరోగా నటిస్తూనే గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మాతగానూ ఉత్తమ చిత్రాలను నిర్మించారు.
రాజకీయ రంగ ప్రవేశం :
రాజకీయాలపై మక్కువతో 1991లో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు కృష్ణంరాజు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం స్థానం నుంచి పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్ధి భూపతిరాజు విజయ్ కుమార్ రాజు చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో కొద్దికాలం పాటు రాజకీయాలకు దూరంగా వున్న ఆయన 1998లో బీజేపీలో చేరి కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1999లో మధ్యంతర ఎన్నికలు రావడంతో నర్సాపురం నుంచి పోటీచేసి గెలుపొంది నాటి వాజ్‌పేయ్ కేబినెట్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2004లో మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో పార్టీలో చేరి రాజమండ్రి లోక్‌సభ స్ధానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com