రెబల్ స్టార్ కృష్ణం రాజు చేతుల మీదుగా 'సినీ స్వర్ణ యుగంలో సారథి' పుస్తకం ఆవిష్కరణ

  • IndiaGlitz, [Tuesday,December 26 2017]

ప్ర‌ముఖ చ‌ల‌న చిత్ర సీనియ‌ర్ న‌టులు శ్రీ కె.జె సారధి పై ర‌చ‌యిత‌, చిత్ర‌కారుడు రాంపా ' సినీ స్వర్ణ యుగంలో సారథి' టైటిల్ తో ఓ పుస్త‌కాన్ని ర‌చించారు. కాగా ఆ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం సోమ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్ లో ఘ‌నంగా జ‌రిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. తొలి ప్ర‌తిని ర‌చయిత ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రాకు అందించారు. పుస్త‌కాన్ని కృష్ణం రాజుకు అంకితమిచ్చారు. ఇదే వేదికపై కృష్ణంరాజు ను సార‌ధి..రాంపా సాలువా తో స‌న్మానించారు.

అనంత‌రం కృష్ణం రాజు మాట్లాడుతూ, ' సార‌ధి తో నాది 50 ఏళ్ల నాటి స్నేహం. నాకున్న స్నేహితుల్లో ఆయ‌న ఓ ముఖ్య వ్య‌క్తి. సినిమా ఇండ‌స్ర్టీ కి హీరో అవుదామ‌ని వ‌చ్చారు. కానీ హాస్య న‌టుడ‌య్యారు. ఆ విషయం కొంత కాలం త‌ర్వాత తెలిసింది. చాలా తెలివైన వ్య‌క్తి. అనేక నాట‌కాలు వేశారు. ఇద్ద‌రం క‌లిసి చాలా సినిమాల్లో న‌టించాం. ఆయ‌న న‌వ్వు లో ప్ర‌త్యేక‌త ఉంది. అదే ఆయ‌న్ను హాస్య న‌టుడిని చేసింది. త‌ర్వాత ఆ న‌వ్వు చాలా మందికి స్ఫూర్తిగా..ఆద‌ర్శంగా నిలిచింది. ఆయ‌న‌పై రాంపా పుస్త‌కం రాయ‌డం చాలా సంతోషంగా ఉంది. సార‌ధి గారు ఇలాగే న‌వ్వుతూ..న‌లుగుర్నీ న‌వ్విస్తూ ఉండాలి' అని అన్నారు.

సార‌ధి మాట్లాడుతూ, ' 378 సినిమాల్లో న‌టించా. ఏమీ లేకుండా సినిమా ఇండ‌స్ర్టీకి వ‌చ్చి ఇంత‌టి వాడిన‌య్యా. ఈరోజు మంచి స్థానంలో ఉన్నానంటే కార‌ణం ప్రేక్ష‌క దేవ‌త‌లే. 60 ఏళ్ల సినీ స్వ‌ర్ణ‌యుగంలో ఎంద‌రో గొప్ప వ్య‌క్త‌లు సినిమాల్లో న‌టించాను. ఎన్టీఆర్, ఎస్. వి.రంగారావు, నాగేశ్వ‌ర‌రావు, రేలంగి, కృష్ణ‌, చిరంజీవి ల‌తో క‌లిసి న‌టించా. నా చివ‌రి సినిమా వెంక‌టేష్ నటించిన గ‌ణేష్. త‌ర్వాత సినిమాలు చేయ‌లేదు. నేను 16 ఏళ్ల పాటు త‌ల్లిగ‌ర్భంలో ఉండిపోయాను. స‌రైన గుర్తింపు రాలేదు. ఆ స‌మ‌యంలో కృష్ణం రాజు 'భ‌క్త‌క‌న్న‌ప్ప' సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది. ఆ హిట్ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. త‌ర్వాత చాలా మంచి పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాను. మీ దీవెన‌లు ఎల్ల‌కాలం ఇలాగే ఉండాల‌ని కోరుకుంటున్నా' అని అన్నారు.

ర‌చ‌యిత ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ, ' సార‌ధి గారు కృష్ణంరాజు, ప్ర‌భాక‌ర్ రెడ్డి ల ద‌గ్గ‌ర ఎక్కువ‌గా క‌నిపించేవారు. అలా ఆయ‌న‌తో మంచి స్నేహం ఏర్ప‌డింది. ఆయ‌న కోసం చాలా మంచి పాత్ర‌లు కూడా రాశాం. సార‌ధి, ప్ర‌భాక‌ర్ రెడ్డి గారి కృషి వ‌ల్లే చిత్ర‌పురి కాల‌ని ఏర్పాటైంది. 3000 మందికి వ‌స‌తి దొరికిందంటే కార‌ణం వాళ్లిద్ద‌రే. ఇంకా 1500 మందికి ఇళ్లు రానున్నాయి' అని అన్నారు.

న‌టుడు గిరిబాబు మాట్లాడుతూ, ' సార‌ధి నాకు చిర‌కాల మిత్రుడు. 1967లో సినిమా ఇండ‌స్ర్టీకి వచ్చాను. అప్ప‌టి నుంచి ఆయ‌న‌తో స్నేహం ఉంది. ఆయ‌న‌కు నేను జూనియ‌ర్ లా ఫీలై న‌మ‌స్కారాలు పెట్టేవాడిని. కానీ ఆయ‌న సీనియారిటీ ఏంటో మాకు ఫోన్లు చేసి సినిమా విశేషాల గురించి అడిగితే తెలిసింది( న‌వ్వుతూ) . త‌ర్వాత ఇద్ద‌రం క‌లిసి చాలా సినిమాల్లో న‌టించాం. ఆయ‌న సొంతంగా చేసిన సినిమాల్లోనేను..నేను చేసిన సినిమాల్లో ఆయ‌న చాలా కాలం పాటు న‌టించాం' అని అన్నారు .

కృష్ణంరాజు స‌తీమ‌ణి శ్యామ‌ల మాట్లాడుతూ, 'ఆయ‌న‌కు మా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. సార‌ధి గారు ఆదివారం రోజు మా ఇంటికొచ్చి...కృష్ణంరాజు గారితో క‌లిసి మాట్లాడ‌టం.. మ‌ధ్నాహ్నం బోజునం చేస్తుంటారు. ఆ డిస్క‌ష‌న్ లో ఎక్కువ‌గా మ‌ద్రాసు విష‌యాలే వ‌స్తుం టాయి. 'భ‌క్త‌క‌న్న‌ప్ప‌', 'అమ‌ర‌దీపం' సినిమాల్లో సార‌ధి గారు పో షించిన పాత్ర‌లంటే చాలా ఇష్టం. వాస్త‌వానికి ఈపుస్త‌కాన్ని ప్ర‌భాస్ కు అందించాల‌నుకున్నారు. కానీ ఆయ‌న అమెరికాలో ఉండ‌టం వ‌ల్ల వీలు ప‌డ‌లేదు' అని అన్నారు.

'మా' అధ్య‌క్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ, 'సార‌ధి గారిది...నాది భీమ‌వ‌ర‌మే. మా నాన్న‌గారికి బాగా సన్నిహితులు. 10 మందికి స‌హాయం చేసే గుణం గ‌ల వ్య‌క్తి. చిత్ర‌పురి కాల‌నీ ఏర్పాటైందంటే కార‌ణం ఆయ‌న‌' అని అన్నారు.

జూబ్లీ హిల్స్ కార్పోరేట‌ర్ కాజా సూర్య నారాయ‌ణ మాట్లాడుతూ, ' 'మా' త‌రుపున‌ సార‌ధి గార్ని స‌న్మానించుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మ‌రింత మంది సీనియ‌ర్ ఆర్టిస్టుల‌ను సత్క‌రించుకోవాలి. సార‌ధిగారు ఓసారి జూబ్లిహిల్స్ లో ఓ ప్లాట్ ఇప్పించ‌మ‌ని అడిగారు. ల‌క్కీగా ఆయ‌న వెయిటింగ్ లిస్టు లో లేక‌పోయినా ఓ ప్లాట్ ఇప్పించ‌గ‌లిగా. అది అదృష్టంగా భావిస్తున్నా' అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో సాంబ‌శివ‌రావు, నిరంజ‌న్, బాల‌రాజు, క‌డ‌లి సురేష్ బాబు, నాగినీడు, శ్రీరామ్ ఏడిద‌, సురేష్ కొండేటి త‌దిత‌రులు పాల్గొన్నారు.