తమిళనాడు గవర్నర్గా కృష్ణంరాజు?
- IndiaGlitz, [Thursday,January 07 2021]
బీజేపీ సీనియర్ నేత, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. తమిళనాడుకు గవర్నర్గా కృష్ణంరాజును నియమించేందుకు కేంద్రం సమాయత్తమవుతోందని సోషల్ మీడియాలో ఆయనతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కొందరైతే ఏకంగా సోషల్ మీడియా వేదికగా కృష్ణంరాజుకు అభినందనలు సైతం తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకూ కేంద్ర హోంశాఖ నుంచి గానీ.. కృష్ణం రాజు, ప్రభాస్ ల నుంచి గానీ.. ఆయన కుటుంబసభ్యుల నుంచి గానీ దీనిమీద ప్రకటన రాలేదు.
అయితే.. కృష్ణంరాజు గత కొంత కాలంగా రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. అయినప్పటికీ ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు. నటుడిగా మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే కృష్ణంరాజు బీజేపీలో చేరారు. అనంతరం 1998లో కాకినాడ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 1999లో మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. వివిధ కమిటీల్లో సభ్యుడిగా పని చేశారు. 2000 సంవత్సరంలో వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
కాగా.. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కృష్ణంరాజు చేరారు. అనంతరం కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న మీదట తిరిగి బీజేపీలో చేరారు. 2016లో రోశయ్య గవర్నర్ పదవి నుంచి వైదొలిగిన అనంతరం నుంచి తమిళనాడుకు గవర్నర్ నియమితం కాలేదు. రోశయ్య అనంతరం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న విద్యాసాగర్ రావే కొద్ది రోజుల పాటు తమిళనాడుకు కూడా గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్గా కృష్ణంరాజు పేరు తెరపైకి రావడం హర్షించదగిన పరిణామం.