'సాక్షి' నుంచి ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కృష్ణమోహన్!
- IndiaGlitz, [Friday,June 07 2019]
సీనియర్ జర్నలిస్ట్, జర్మలిజంలో సత్తా చాటి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జీవీడీ కృష్ణ మోహన్‌ను కీలక పదవి వరించింది. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కృష్ణ మోహన్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రోజున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆయన నియామకంకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. ఈ ఉత్తర్వుల మేరకు కమ్యూనికేషన్స్ సలహాదారుగా కృష్ణ మోహన్ వ్యవహరించనున్నారు. అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అయినా బయటికి రావాలన్నా.. ముఖ్యంగా మీడియాకు అందాలన్నా కృష్ణమోహన్ నుంచే తెలియాలన్న మాట.
‘సాక్షి’ నుంచి సలహాదారుగా!
ప్రభుత్వ సలహాదారుగా అవకాశం దక్కడంతో మోహన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఏపీ ప్రభుత్వంలో పనిచేసేందుకు అవకాశం లభించినట్లు తెలుసుకున్న కృష్ణ మిత్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. కృష్ణమోహన్ ‘ఈనాడు’, ‘సాక్షి’ పత్రికల్లో పాత్రికేయుడిగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా ఆయన పనితనంను గుర్తించిన వైఎస్ జగన్ తన ప్రభుత్వంలోకి తీసుకుని.. ఇక నుంచి ఆయన సేవలను ఏపీ ప్రభుత్వంలో వాడుకోనున్నారు. ఇదిలా ఉంటే.. సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్, అదనపు కార్యదర్శిగా జె.మురళీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా వీరందరూ త్వరలోనే విధుల్లో చేరబోతున్నారు. ప్రమాణ స్వీకారం మొదలుకుని నేటి వరకూ వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు సాహోసేపేతమైనవి అని రాజకీయ నేతలు, రాజకీయ విశ్లేషకులు సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.