Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు .. స్పందించని జనసేనాని

  • IndiaGlitz, [Wednesday,October 04 2023]

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. పెడనలో జరగనున్న తన వారాహి యాత్రలో దాడులు చేస్తారని.. దీనిపై విశ్వసనీయ సమాచారం వుందంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా.. దాడులకు సంబంధించిన సమాచారం వుంటే తమకు ఇవ్వాలని బుధవారం నోటీసులు జారీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని.. పెడనలో జరగనున్న వారాహి యాత్రకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా ఎవరైనా అసాంఘిక శక్తులు దాడికి గనుక పథక రచన చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జాషువా వెల్లడించారు. తాము ఇచ్చిన నోటీసులకు పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి స్పందన లేదని.. అంటే నిరాధారామైన ఆరోపణలు చేశారని అనుకోవాలా అని ఎస్పీ ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసేటప్పుడు బాధ్యతగా వుండాలని.. బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే పర్యవసనాలు తీవ్రంగా వుంటాయని ఆయన హెచ్చరించారు.

వారాహి యాత్రపై దాడికి కుట్ర చేస్తున్నారన్న పవన్ :

కాగా.. నిన్న పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. పెడన నియోజకవర్గంలో జరగనున్న తన వారాహి యాత్రపై రాళ్లదాడి చేసేందుకు వైసీపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. వైసీపీ మద్ధతుదారులు వారాహి యాత్రలో రాళ్ల దాడులు చేసి, రక్తపాతం సృష్టించాలని చూస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడినా జనసేన నేతలు ఓపిక పట్టాలని పవన్ సూచించారు. వారాహి యాత్రపై రాళ్ల దాడి చేసినా వారిపై ప్రతి దాడి చేయొద్దని, పోలీసులకు అప్పగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పెడనలో జరిగే పరిణామాలకు డీజీపీ, ప్రభుత్వమే సమాధానం చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. పులివెందుల రౌడీయిజం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని జనసేనాని హెచ్చరించారు.

అస్వస్థతకు గురైన పవన్ :

ఇదిలావుండగా.. పవన్ కల్యాణ్ మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మచిలీపట్నంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలు స్వీకరించారు. అయితే వెన్నునొప్పి తీవ్రం కావడంతో పవన్ మధ్యలోనే వెళ్లిపోయారు. మరోవైపు పవన్ ఆరోగ్యంపై జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.