కంగ‌నా వివాదంపై .. క్రిష్ చెప్పిన నిజాలు

  • IndiaGlitz, [Saturday,January 26 2019]

జాగ‌ర్ల‌మూడి క్రిష్, బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ కాంబినేష‌న్‌లో 'మ‌ణిక‌ర్ణిక‌: ది ప్రిన్సెస్ ఆఫ్ ఝాన్సీ' సినిమాను అనౌన్స్ చేశారు. నేడు గ‌ణ‌తంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ సినిమా విడుద‌లైంది. సినిమా మ‌ధ్య‌లోనే ఆ ప్రాజెక్ట్ నుండి క్రిష్ వ‌చ్చేశాడు. కంగ‌నా ద‌ర్శ‌క‌త్వం చేసుకుంది. కంగ‌నా ఎందుకు ద‌ర్శ‌క‌త్వం చేయాల్సి వ‌చ్చిందనే విష‌యాన్ని క్రిష్ ఎప్పుడూ చెప్ప‌లేదు. చివ‌ర‌కు సినిమా విడుద‌ల త‌ర్వాత ఓ ఇంట‌ర్వ్యూలో క్రిష్ 'మ‌ణిక‌ర్ణిక‌' సినిమా విష‌యంలో ఏం జ‌రిగింద‌నే దానిపై తొలిసారి నోరు విప్పాడు.. క్రిష్ ఏమ‌న్నాడంటే...

సినిమాను గ‌త ఏడాది ఆగ‌స్ట్ 15కి విడుద‌ల చేయాల‌నుకున్నారు. జూన్ కంతా క్రిష్ డ‌బ్బింగ్ వ‌ర్క్ పూర్తి చేసేశారు. కంగ‌నా మాత్రం డ‌బ్బింగ్ చెప్పాల్సి ఉంది. ఆ స‌మ‌యంలో ఆమె 'మెంట‌ల్ హై క్యా' సినిమా కోసం లండ‌న్‌లో ఉన్నారు. లండ‌న్ నుండి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత సినిమా చూసి న‌చ్చింద‌ని అని, చిన్న చిన్న మార్పులు చేయాలంటూ చెప్పుకుంటూ వ‌చ్చారు. ఆరు రోజులు సినిమాను రీ షూట్ చేశాం. చివ‌ర‌కు నిర్మాత క‌మ‌ల్ జైన్‌కు సినిమా న‌చ్చ‌లేద‌ని అన్నారు. రీషూట్ స‌మ‌యంలో కంన‌గా స‌దాశివ‌రార‌వు(సోనూసూద్‌) పాత్ర‌ను ఇంటర్వెల్‌లోనే చంపేద్దామ‌ని అన్నారు. అలా చేస్తే చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించ‌డ‌మే అన్నాను. మా మ‌ధ్య పెద్ద వాద‌నే జ‌రిగింది.

ప్ర‌తి నాయ‌కుడిగా న‌టించిన సోనూసూద్ చాలా కీల‌క‌మైన పాత్ర‌. ఆయ‌న పాత్ర నిడివి 100 నిమిషాలుంటుంది. దాన్ని 60 నిమిషాల‌కు త‌గ్గించేస్తే ఎవ‌రు ఊరుకుంటారు. ఆయ‌న 35 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ పాత్ర‌ను ఇంట‌ర్వెల్‌లో చంపేయ‌లేమ‌ని.. దాన్ని నేను షూట్ చేయ‌లేమ‌ని అన్నారు. అప్పుడు క‌మ‌ల్ జైన్ కంగ‌నా డైరెక్ట్ చేస్తార‌ని అన్నారు. అయితే నేను డైరెక్ట్ చేయ‌క‌పోతే నేను న‌టించ‌న‌ని సోనూ సూద్ అన్నారు. ఆ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నారు. మ‌హిళా ద‌ర్శ‌కురాలితో ప‌నిచేయ‌డం ఇష్టం లేక సోనూ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నార‌ని కంగనా అన్నారు. ముఖ్య పాత్ర‌ల‌ను చాలా వ‌ర‌కు డిలీజ్ చేశారు.

నా ప‌నిత‌నం బాలేద‌ని జీ స్టూడియోస్ భావిస్తున్న‌ట్లు కంగనా న‌న్ను న‌మ్మించారు. అప్ప‌టి వ‌ర‌కు షూట్ చేసిన సినిమా బోజ్‌పురి సినిమాలా ఉంద‌ని అన్నారు. దానికి నేను న‌వ్వి.. నా ప‌నితనం ఏంటో ప్ర‌జ‌ల‌కు తెలుసున‌ని ఆమెకు చెప్పాను. ఆమె గ‌ట్టిగా వాద‌న‌కు దిగేవారు. ప్ర‌తిసారి మూర్ఖంగానే ముందుకు వెళ్లారు.

ముందు నా పేరును పోస్ట‌ర్‌లో క్రిష్ అని వేశారు. త‌ర్వాత టీజ‌ర్‌లో జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ అని వేశారు. ఆ విష‌యాన్ని నేను చెబితే సోనూ విష‌యంలో మీరు మాకు స‌పోర్ట్ చేయ‌లేదు. ఇప్పుడు మీ అవ‌స‌రం ఉంది కాబ‌ట్టే వ‌చ్చారని కంగ‌నా నాతో అన్నారు. టైటిల్స్‌లో కూడా నా పేరుని అలాగే వేశారు. ద‌ర్శ‌క‌త్వంలో ముందు త‌న పేరు వేసుకుని ఆమె ప్ర‌శాంతంగా ఎలా నిద్ర‌పోతున్నారో నాకు తెలియ‌డం లేదు. ఆమెకి అర్హ‌త లేదు..

అంటూ క్రిష్ 'మ‌ణిక‌ర్ణిక‌' స‌మ‌యంలో జ‌రిగిన వివాదాల గురించి, త‌నెందుకు ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంద‌నే విష‌యాన్ని తెలిపారు.