Download App

Krack Review

కోవిడ్‌ ప్రభావ సమయంలో విధించిన లాక్‌డౌన్‌ను థియేటర్స్‌ విషయంలో సవరించిన ప్రభుత్వాల యాబై శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్‌ ఇచ్చాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలైనప్పటికీ, ఓ స్టార్‌ సినిమా విడుదలైతే థియేటర్స్‌ వైపు ప్రేక్షకులు ఆకర్షితులవుతారని అందరూ అనుకుంటున్న తరుణంలో సంక్రాంతి బరిలోకి నాలుగు సినిమాలు వస్తున్నట్లు ఖరారైంది. ఇందులో ముందుగా రవితేజ క్రాక్‌ సినిమా రావడానికి రెడీ అయ్యింది. అయితే కొన్ని ఆర్థిక సమస్యలు కారణంగా సినిమా మార్నింగ్, మ్యాట్నీ షోలు ప్రదర్శితం కాలేదు. చివరకు ఫస్ట్‌ షో నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రాక్‌ సినిమా.. ఆకట్టుకుందా?  లేదా? సంక్రాంతికి క్రాక్‌ మంచి బోణి కొట్టినట్లేనా? రవితేజ, గోపీచంద్‌ మలినేని వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టారా?  అనే సంగతులు తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం..

కథ:

పోతరాజు వీరశంకర్‌(రవితేజ) సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌. తప్పు చేసినవాడు ఎవడైనా బ్యాగ్రౌండ్‌ గురించి మాట్లాడితే వాడి అంతు చూడందే శంకర్‌ ఊరుకోడు. అలాంటి శంకర్‌కి కడపకు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అదే సమయంలో కడపలోని కొండారెడ్డి(రవిశంకర్‌), తన తోటలోకి మామిడికాయల కోసం వచ్చిన చిన్నపాపపై కుక్కలను ఉసిగొల్పి పాపను గాయపరుస్తాడు. ఆ కేసును శంకర్‌ డీల్‌ చేస్తాడని తెలుసుకున్నపై అధికారి.. కొండారెడ్డిని హెచ్చరిస్తాడు. శంకర్‌ గురించి తెలుసుకోవాలంటే రాజమడ్రి సెంట్రల్‌ జైల్‌లోని కటారి కృష్ణ(సముద్రఖని)ని కలుసుకోమని చెబుతాడు. ఆయన చెప్పినట్లే కొండారెడ్డి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వెళ్లి కటారి కృష్ణను కలుస్తాడు. ఒంగోలు చుట్టు పక్కల గ్రామాల్లో కటారికృష్ణ పేరు చెబితే అందరూ భయపడుతుంటారు. అలాంటి కటారి కృష్ణ తన కూతురిపై ప్రేమతో ఓ తప్పు చేస్తాడు. ఆ తప్పేంటి?  ఆ తప్పుకు శంకర్‌ ఏం చేస్తాడు? కటారికృష్ణకు ఎలాంటి పరిస్థితి తీసుకొస్తాడు? మరి కటారికృష్ణ గురించి తెలుసుకున్నకొండారెడ్డి ఏం చేస్తాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

రాజాదిగ్రేట్‌ తర్వాత రవితేజకు సాలిడ్‌ హిట్‌ లేదు. అలాగే డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేనికి కూడా సరైన హిట్‌ లేదు. వీరిద్దరూ ఇది వరకు కలిసి పనిచేసి డాన్‌శీను, బలుపు సినిమాలు చాలా మంచి హిట్స్‌గా నిలిచాయి. ముచ్చటగా మూడోసారి వీరి కాంబోలో రూపొందిన సినిమా క్రాక్‌. సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ ఆసక్తిని పెంచేలా దర్శకుడు గోపీచంద్‌ మలినేని సినిమాను తెరకెక్కించాడు. రవితేజ బాడీలాంగ్వేజ్‌కు తగిన మాస్‌, పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించాడు డైరెక్టర్‌. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పనితనం ఎంతలా ఉంటుందనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. సినిమాను ప్రారంభించిన తీరు.. ప్రతి సన్నివేశంలో హీరో క్యారెక్టరైజేషన్‌ను ఎలివేట్‌ చేసిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే విలన్‌ సముద్రఖని పాత్రను కూడా చాలా గొప్పగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వేటాపాలెం విలన్‌ గ్యాంగ్‌..గాడిదరక్తం తాగుతూ  వారు హత్యలు చేసే విధానం.. రొటీన్‌కు కాస్త భిన్నంగా అనిపిస్తాయి. ఇక కొన్ని సన్నివేశాల్లో హీరో మాత్రమే గొప్ప అని చూపించేలా ఉండే సన్నివేశాలు కూడా సిల్లీగా అనిపిస్తాయి. ఓ సీఐ అంతలా ఉండేటప్పుడు మిగతా డిపార్ట్‌మెంట్‌ పనిచేయడం లేదా? అనిపించేలా సినిమా ఉంటుంది. సరే! కమర్షియల్ సినిమా కాబట్టి సర్దుకుపోవాలి. శ్రుతి హాసన్‌కు ఇది రీ ఎంట్రీ మూవీ అని చెప్పాలి. లుక్స్‌ పరంగా శ్రుతిహాసన్‌ చాలా చక్కగా ఉంది. ఆమె పాత్రను చక్కగా ఎలివేట్‌ చేశారు. ఇక విలన్‌కు రైట్‌ హ్యాండ్‌గా వరలక్ష్మి శరత్‌కుమార్‌ పాత్రను కూడా చక్కగా డిజైన్‌ చేశారు. ఈ పాత్రలన్నింటినీ ప్రధానంగా ఉండే హీరో పాత్రను రవితేజ క్యారీ చేసిన తీరు చాలా బావుంది.

ఇక సాంకేతిక అంశాల విషయాలకు వస్తే.. తమన్‌ సంగీతంలో పాటల్లో మాస్‌ బిర్యానీ, అంకితా రాణి ఐటెమ్‌ సాంగ్‌ వినడానికి బావున్నాయి. మంచి బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చాడు తమన్‌. విష్ణు సినిమాటోగ్రఫీ బావుంది. ఇక సినిమాకు యాక్షన్‌ అంశాలు మంచి ఎసెట్‌గా నిలిచాయనడంలో సందేహం లేదు. రామ్‌ లక్ష్మణ్‌లు ఫైట్స్‌ను తెరకెక్కించిన తీరు బావుంది. బస్టాండ్‌లో ఫైట్‌, ఇంటర్వెల్‌ ఫైట్‌ మెప్పిస్తుంది. ఎడిటింగ్‌ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.

చివరగా.. క్రాక్‌... పక్కా మాస్‌ మసాలా బిర్యానీ

Read Krack Review in English

Rating : 3.0 / 5.0