కమల్ హాసన్ గారు నాకు స్ఫూర్తి: కౌశిక్ బాబు
- IndiaGlitz, [Sunday,August 16 2015]
"నటుడిగా కమల్ హాసన్ గారు నాకు స్ఫూర్తి. ఆయన చిత్రాలు చూస్తూ పెరిగాను. 'సాగర సంగమం' నుంచి 'ఉత్తమ విలన్' వరకూ కమల్ నటించిన ప్రతి చిత్రం ఇష్టమే. కమల్ తరహాలో వైవిధ్యమైన చిత్రాలు, పాత్రల్లో నటించాలని నా కోరిక" అన్నారు యువనటుడు కౌశిక్ బాబు. బాలనటుడిగా ప్రేక్షకులకు పరిచయమైన కౌశిక్, మలయాళంలో కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగు, మలయాళ భాషల్లో రూపొందుతున్న 'మిస్టర్ కె'లో నటిస్తున్నారు. సోమవారం కౌశిక్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..
'వైట్ బాయ్స్'కు 3స్టేట్ అవార్డులు..
చైల్డ్ ఆర్టిస్టుగా చిన్నతనంలో బర్త్ డేలన్నీ ఎక్కువగా షూటింగ్ లొకేషన్లో జరిగాయి. ఈ యేడాది 'మిస్టర్ కె' చిత్రీకరణలో పుట్టినరోజు జరుగుతుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో పతాక సన్నివేశాలలో వచ్చే యాక్షన్ ఘట్టాలను చిత్రికరిస్తున్నాం. ఈ పుట్టినరోజుకి లభించిన గిఫ్ట్.. మలయాళంలో హీరోగా నటించిన 'వైట్ బాయ్స్' చిత్రానికి మూడు స్టేట్ అవార్డులు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది.
ఇమేజ్ మార్పు కోసం ప్రయత్నం..
10వ తరగతిలో అయ్యప్పగా నటించాను. తర్వాత రాముడిగా, విష్ణుమూర్తిగా, శివుడిగా చేశాను. రామాయణం, మహాభారతం ఇలా అన్నిటిలో నటించాను. ఆధ్యాత్మిక చిత్రాల్లో ఎక్కువగా నటించడం వలన అటువంటి చిత్రాలకు కౌశిక్ బాబు సూటవుతాడనే ఇమేజ్ వచ్చింది. నటనలో వైవిధ్యం చూపడానికి కుదరలేదు. ప్రేమికుడిగా, యాక్షన్ హీరోగా నటించే అవకాశం రాలేదు. ప్రస్తుతం చేస్తున్న 'మిస్టర్ కె'లో ప్రేమ, డాన్స్, యాక్షన్ వినోదం అన్ని అంశాలు ఉన్నాయి. దర్శకుడు శశాంక్ వోలేటి వినోదాత్మకంగా తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమాతో బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను. ఇమేజ్ మారుతుందని ఆశిస్తున్నాను. పూర్తిస్థాయి కథానాయకుడిగా ఆవిష్కరించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.
మలయాళంలో కుట్టి ఎన్టీఆర్ అన్నారు...
మలయాళం స్పష్టంగా మాట్లాడగలను. కమర్షియల్, యాక్షన్ చిత్రాలు తక్కువ. అల్లు అర్జున్ డాన్స్, యాక్షన్ చూసి మలయాళీలు అభిమానులయ్యారు. వాళ్లకు అది కొత్తగా అనిపించింది. నేను పూర్తిగా మలయాళం చిత్రాల్లో నటించాను. వాళ్లలో ఒకడిగా ఆదరిస్తున్నారు. నాలుగు చిత్రాల్లో నటించాను. నటుడిగా మంచి పేరొచ్చింది. అక్కడ 20రోజుల్లో ఓ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. నిర్మాణ వ్యయం, షూటింగ్ డేస్ ఇతర విషయాల్లో మాలీవుడ్, టాలీవుడ్ మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఇకపై నటించబోయే చిత్రాలను రెండు భాషల్లో చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. తెలుగు, మలయాళం భాషలకు ప్రాముఖ్యతనిస్తాను.
అసంతృప్తి లేదు..
ఇప్పటివరకు చేసినవన్నీ మంచి సినిమాలే. 'ఆదిశంకర', 'షిరిడి సాయి', 'పవిత్ర' లాంటి చిత్రాల్లో మళ్లీ మళ్లీ నటించే అవకాశం రాదు. రాఘవేంద్రరావు, బాలకృష్ణ, నాగార్జున, భారవి వంటి అనుభవజ్ఞులతో పనిచేసే అవకాశం లభించింది. నాతోటి కథానాయకులతో పోల్చుకోవడం లేదు. ఎటువంటి అసంతృప్తి లేదు. చెప్పాలంటే.. సంతోషంగా ఉన్నాను. వ్యక్తిగతంగా యాక్షన్ చిత్రాలను ఇష్టపడతాను. నటుడిగా అన్ని రకాల చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను.