Kousalya Krishnamurthy Review
తమిళంలో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్యా రాజేశ్ నిజానికి మన తెలుగు అమ్మాయే. తమిళంలో పాతిక సినిమాల్లో నటించేసింది. ఇప్పుడు తెలుగులోకి `కౌసల్య కృష్ణమూర్తి` చిత్రంతో అడుగుపెట్టింది. నిజానికి ఇది కూడా తమిళ సినిమాయే. `కనా` పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు `కౌసల్య కృష్ణమూర్తి` పేరుతో రీమేక్ చేశారు. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే ముందు సినిమా కథలోకి వెళదాం...
కథ:
కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్) ఓ రైతు.. వ్యవసాయాన్ని ఎంత బాగా ఇష్టపడతాడో.. అంతే బాగా క్రికెట్‌ను కూడా ఇష్టపడతాడు. ఊర్లో అందరూ అతన్ని క్రికెట్ పిచ్చోడు అని అంటుంటారు. క్రికెట్‌లో ఇండియా ఓడిపోయిన ప్రతిసారి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అది చూసిన అతని కూతురు కౌసల్య(ఐశ్వర్యా రాజేశ్).. క్రికెటర్ అయ్యి దేశం తరపున ఆడి, గెలిపించి.. తండ్రి కళ్లల్లో ఆనందం చూడాలని అనుకుంటుంది. పల్లెటూరు కావడంతో క్రికెట్ ఆడే అమ్మాయిలే ఉండరు. కానీ అదే ఊళ్లో క్రికెట్ ఆడుతున్న మగపిల్లలతో కలిసి క్రికెట్ ఆటను నేర్చుకుంటుంది. పెద్దయిన తర్వాత క్రికెట్ ఆడుతున్న కౌలస్యను చూసి, ఆడపిల్లలు క్రికెట్ ఆడటం ఏంటి? అని విమర్శిస్తున్నా.. కూతుర్ని ఎంకరేజ్ చేస్తాడు కృష్ణమూర్తి. కౌసల్య తన ప్రతిభతో నేషనల్ ఉమెన్స్ క్రికెట్ టీమ్‌కి ఎంపిక అవుతుంది. మరో పక్క నీళ్లు లేకుండా పంటలు ఎండిపోవడంతో బ్యాంకు లోను కట్టమని అధికారులు కౌసల్య ఇంటిని జప్తు చేస్తారు. ఆ సమయంలో కౌలస్య ఉమెన్స్ టీ 20 సెమీఫైనల్స్ ఆడుతుంటుంది. అప్పుడు ఆమె క్రికెట్ ఆడనని నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఆమె కోచ్ నెల్సన్(శివకార్తీకేయన్) ఆమెలో స్ఫూర్తి నింపుతాడు. మరి కౌసల్య నిర్ణయం మార్చుకుంటుందా? ఇండియా టీమ్‌ను గెలిపించి తండ్రి కళ్లలో ఆనందం చూస్తుందా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
నటీనటుల పరంగా చూస్తే సినిమా ప్రధానంగా రెండు పాత్రల మధ్య సాగుతుంది. మొదటి పాత్ర కృష్ణమూర్తి అనే రైతు పాత్ర. వ్యవసాయాన్ని.. క్రికెట్‌ను సమానంగా ప్రేమించే ఈ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ తనదైన రీతిలో చక్కగా నటించారు.ఈయన నటన గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. కూతురు క్రికెట్ ఆడతానంటే ప్రోత్సహించే తండ్రిగా.. తల్లిని కూతురు ఎదిరిస్తే దండించే తండ్రిగా.. లోను కట్టమని బ్యాంకు అధికారులు ఇబ్బందులు పెడితే వాటిని భరించే సామాన్యమైన రైతుగా.. తన కష్టాలను కూతురికి తెలియనీయని తండ్రిగా..ఇలా భిన్నకోణాలుండే ఈ పాత్రలో రాజేంద్రప్రసాద్ నటన సింప్లీ సూపర్బ్. ఇక రెండో పాత్ర ఉమెన్ క్రికెటర్ కౌసల్య. ఈ పాత్రను ఐశ్వర్యా రాజేశ్ పోషించింది. ఇదే పాత్రను ఆల్‌రెడీ తమిళంలో చేసిన ఐశ్వర్యా రాజేష్ అదే ఇన్‌టెన్స్‌తో తెలుగులోనూ చేసింది. తండ్రి కళ్లలో ఆనందం చూడాలనే కూతురి పాత్రలో.. దేశం తరపున క్రికెట్ ఆడాలనుకునే సామాన్యమైన క్రికెటర్‌గా.. సన్నివేశాల్లోని ఎమోషన్స్‌ను చక్కగా క్యారీ చేసింది. ఇక ఆడపిల్ల క్రికెట్ ఆడటం ఏంటి? అంటూ భర్తను, కూతురిని తిట్టే పాత్రలో ఝాన్సీ నటన ఆకట్టుకుంటుంది. ఇక గెస్ట్ అప్పియరెన్స్ చేసిన శివకార్తీకేయన పాత్రను తమిళంలో నుండి తీసుకున్నదే. హీరోయిన్‌ను ప్రేమించి ఆమెకు సపోర్ట్ చేసే ప్రేమికుడు సాయికృష్ణ పాత్రలో కార్తీక్ రాజు, బ్యాంకు మేనేజర్‌గా భీమనేని, టీచర్‌గా రవిప్రకాశ్, మహేశ్, విష్ణు పాత్రలు మెప్పిస్తాయి.
ఇక సాంకేతికంగా చూస్తే.. రీమేక్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్న భీమనేని శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లు ఆవిష్కరించడంలో ఈయన సక్సెస్ అయ్యాడు. అలాగే ఎమోషన్స్‌ను క్యారీ చేయించడంలోనూ సక్సెస్ అయ్యాడు భీమనేని. అండ్రూ తన కెమెరాతో సన్నివేశాలను చక్కగా విజువలైజ్ చేశాడు. సినిమా వ్యవథి ఎక్కువగా అనిపించింది. ఓ పదిహేను నిమిషాలు సినిమాను ఎడిట్ చేసుంటే బావుండేది. తమిళంలోని కొన్ని సన్నివేశాలను అలాగే తెలుగులోనూ వాడుకున్నారనే సంగతి తెలిసిపోతుంది. ఐశ్వర్యా రాజేష్, శివకార్తీకేయన్ లకు తెలుగులో పెద్దగా గుర్తింపు లేదు. మరి సినిమాలో కీలకమైన ఈ పాత్రలను తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాల్సిందే..
బోటమ్ లైన్: సందేశంతో కూడిన తండ్రీ కూతుళ్ల కథ.. కౌసల్య కృష్ణమూర్తి
- Read in English