చట్టానికి సహకరిస్తా.. నా కొడుకును దూరం పెడతా: ప్రజలకు ఎమ్మెల్యే వనమా బహిరంగ లేఖ
- IndiaGlitz, [Thursday,January 06 2022]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ అనే వ్యక్తి భార్య, ఇద్దరు ఆడపిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు రావడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. సాయం చేయాలంటే తన భార్యను గదికి పంపాలని రాఘవ వేధింపులకు గురిచేశాడంటూ చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో రామకృష్ణ చెప్పడంతో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పందిస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారు.
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ ఘటనలో తన కుమారుడిపై ఆరోపణలు రావడం కలిచివేసిందని, పోలీసులు ఎప్పుడు పిలిచినా తన కొడుకుని అప్పగిస్తానని ఆయన స్పష్టం చేశారు. రాఘవ విషయంలో విచారణ నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటున్నట్లు వనమా తెలిపారు. ఇకపై తన కుమారుడిని నియోజకవర్గానికి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతానని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని.... పార్టీలు, వ్యక్తుల ఆరోపణలు తాను పట్టించుకోను అని లేఖలో పేర్కొన్నారు.
ఆయన లేఖ విడుదల చేసిన కొద్దిసేపటికే వనమా రాఘవేంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవను కొత్తగూడెం పోలీసులు గురువారం హైదరాబాద్లో అరెస్టు చేశారు. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో దుమారం రేపింది. అందులో తన నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను ఆయన వివరించారు. ఆ సందర్భంగా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.