మళ్లీ టచ్ చేస్తున్న కొరటాల
- IndiaGlitz, [Saturday,November 18 2017]
మానవ సంబంధాలతో పాటు సామాజిక అంశాలను కూడా టచ్ చేస్తూ దర్శకుడు కొరటాల శివ సినిమాలు తెరకెక్కిస్తుంటారు. తన మొదటి సినిమా 'మిర్చి'లో మనుష్యుల మధ్య ప్రేమానురాగాలను ప్రస్తావించిన శివ.. తన రెండో చిత్రం 'శ్రీమంతుడు'లో గ్రామాన్ని దత్తత తీసుకుని.. ఉన్నవాడు కొంచెం ఇస్తే లేని వాడే ఉండడు అనే అంశాన్ని అందరికి అర్ధమయ్యేలా చెప్పాడు.
ఇక మూడో సినిమా 'జనతా గ్యారేజ్'లో మొక్కలు, చెట్లు, ప్రకృతి పచ్చగా ఉంటే మనం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటామని చెప్పడం జరిగింది. అదే సమయంలో వాటికి హాని చేసేవాడు ఎవడైనా సరే.. వాడ్ని కలుపు మొక్కలా ఏరి పారేయాలని ఒక సందేశం కూడా ఇచ్చాడు.
అంటే గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు మహేష్ తో చేస్తున్న తాజా చిత్రం 'భరత్ అనే నేను'లో కూడా ఓ సామాజిక అంశాన్ని శివ టచ్ చేయబోతున్నాడని తెలిసింది.
ఈ సారి విద్యా వ్యవస్థని ఆయన టార్గెట్ చేసుకున్నారని సమాచారమ్. ఇందులో.. పిల్లలు చదువును బరువుగా, కష్టంగా కాకుండా.. ఇష్టంగా నేర్చుకోవాలనే సందేశం ఇస్తున్నట్లు తెలిసింది. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.