'అవంతిక' చిత్రంతో రామసత్యనారాయణ పెద్ద నిర్మాత అవడం ఖాయం - కొణిజేటి రోశయ్య

  • IndiaGlitz, [Sunday,June 04 2017]

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా భీమవరం టాకీస్‌ బేనర్‌పై కె.ఆర్‌. ఫణిరాజ్‌ సమర్పణలో 'అవును' ఫేమ్‌ పూర్ణ ప్రధాన పాత్రలో శ్రీరాజ్‌ బళ్ల దర్శకత్వంలో రూపొందిన హార్రర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'అవంతిక'. జూన్‌ 16న వరల్డ్‌వైడ్‌గా అత్యధిక థియేటర్లలో రిలీజ్‌ కాబోతోంది. 35 నిమిషాల పాటు ఈ సినిమాలో వచ్చే గ్రాఫిక్స్‌ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి. 'అరుంధతి', 'రాజుగారి గది' చిత్రాల తరహాలో గ్రాఫిక్స్‌కి ప్రాధాన్యం వుంది. ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ కార్యక్రమం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో జూన్‌ 4న జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్య, సీనియర్‌ దర్శకులు రేలంగి నరసింహారావు, ధవళ సత్యం, 'రారండోయ్‌' ఫేమ్‌ కళ్యాణ్‌ కృష్ణ, బాబ్జీ, సూర్యకిరణ్‌, నిర్మాతలు కె.వి.వి.సత్యనారాయణ, శోభారాణి, కొడాలి వెంకటేశ్వరరావు, ఎ.పి.ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండె మల్లిఖార్జునరావు, నటుడు శివారెడ్డి, చిత్ర సంగీత దర్శకుడు రవిరాజా బళ్ల పాల్గొనగా, ఆడియో సీడిని కొణిజేటి రోశయ్య ఆవిష్కరించి తొలి సీడిని ధవళ సత్యంకు అందజేశారు.
ఈ సందర్భంగా కొణిజేటి రోశయ్య మాట్లాడుతూ - ''మా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించినటువంటి 90వ సినిమా 'అవంతిక' కావడం చాలా ఆనందంగా వుంది. సినిమా సక్సెస్‌ఫుల్‌ కావాలి. ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులు, మరియు టెక్నీషియన్స్‌కి నా అభినందనలు. ఒక సినిమా తీయడానికే ఎన్నో కష్టాలు పడాలి అంటుంటారు. అటువంటిది మా రామసత్యనారాయణ 90 సినిమాలు తీశాడు అంటే అతనెంత తెలివిగా, బడ్జెట్‌ని కంట్రోల్‌లో వుంచుకొని కష్టనష్టాల్ని దగ్గరికి రానివ్వకుండా చక్కగా సినిమాలు నిర్మిస్తున్నారంటే చాలా సంతోషంగా వుంది. పాటలు బావున్నాయి. సినిమాలో గ్రాఫిక్స్‌ చూస్తుంటే సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం వుంది. ఈ చిత్రంతో రామసత్యనారాయణ పెద్ద నిర్మాత అవడం ఖాయం'' అన్నారు.
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ - ''ఒక సినిమా విజయవంతం కావాలంటే డబ్బు పెట్టినంత మాత్రాన అవదు. నేను సినిమా బడ్జెట్‌కి సరిపడా డబ్బులు మాత్రమే ఇవ్వగలను. కానీ విజయం అనేది దర్శకుడి చేతిలో వుంటుంది. అనుకున్న టైమ్‌లో అనుకున్న బడ్జెట్‌లో అత్యంత క్వాలిటీతో సినిమా తీసిన దర్శకుడు మా శ్రీరాజ్‌ బళ్ల. సినిమాని చాలా బాగా తీశాడు. మిగతా టెక్నీషియన్స్‌ అంతా శ్రీరాజ్‌కి ఎంతో సహకరించి చిత్రం బాగా రావడానికి కారకులయ్యారు. ఈ సినిమాకి నేను కోట్లు పెట్టానని చెప్పను కానీ.. కోట్లు కలెక్ట్‌ చేస్తుందని మాత్రం చెప్పగలను. ఎందుకంటే నేను చిన్న సినిమాలు తీశానే కానీ ఎవర్నీ ఇబ్బంది పెట్టే సినిమాలు తీయలేదు. 90 సినిమాలు నిర్మించాను. అవి విజయవంతం అయినా, కాకపోయినా నేను అనుకున్న బడ్జెట్‌లోనే సినిమాలు తీశాను. అందుకనే సినిమా పరిశ్రమలో వుండగలిగాను. మా గురువుగారు, దర్శకరత్న, డా. దాసరి నారాయణరావుగారి చేతుల మీదుగా ఈ సినిమా ఓపెనింగ్‌ చేశాం. భౌతికంగా మన మధ్య ఆయన లేనప్పటికీ ఆయన ఆశీస్సులు తప్పకుండా మాకు వుంటాయి. ఈ సినిమాని మా గురువుగారికి అంకితం చేస్తున్నాను. ఈనెల 16న ప్రపంచవ్యాప్తంగా, మరియు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నాం. మేమే కాకుండా మా బయ్యర్స్‌ కూడా సినిమాపై చాలా గట్టి నమ్మకంతో వున్నారు. తప్పకుండా సినిమా పెద్ద హిట్‌ అయి మా బేనర్‌కి మరింత మంచి పేరు తెస్తుంది'' అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీరాజ్‌ బళ్ల మాట్లాడుతూ - ''నాకే కాకుండా మరి కొంతమంది కొత్త టెక్నీషియన్స్‌కి అవకాశం ఇస్తూ.. అందర్నీ ఎంకరేజ్‌ చేస్తున్న భీమవరం టాకీస్‌ అధినేత, తుమ్మలపల్లి రామసత్యనారాయణకి ఆజన్మాంతం రుణపడి వుంటాను. నాకు ఆయన ఒకటే మాట చెప్పారు. ఈ సినిమా హిట్‌ పడితే నీకు మరో 10 సినిమాలకి అవకాశం వస్తుంది. లేదంటే వేరే పని చూసుకోవాల్సి వుంటుంది అన్నారు. అందుకే రెండు నెలల్లో తీస్తానన్న సినిమాకు పది నెలలు పట్టినా.. రామసత్యనారాయణగారు సినిమా క్వాలిటీగా వస్తుందని నన్ను ఎంకరేజ్‌ చేశారు. అనుకున్నట్లుగానే సినిమా చాలా బాగా వచ్చింది. హార్రర్‌ కామెడీ థ్రిల్లర్‌ మూవీ. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషించిన పూర్ణ నటన ఆద్యంతం ఉత్కంఠంగా వుంటుంది. అలాగే మరో హీరోయిన్‌ గీతాంజలి (కొబ్బరి మట్ట ఫేమ్‌) ధన్‌రాజ్‌, షకలక శంకర్‌, అజయ్‌ ఘోష్‌, షాయాజీ షిండే పాత్రలు సినిమాకి ఎస్సెట్‌ అవుతాయి. నాకు అవకాశం ఇచ్చిన రామసత్యనారాయణగారికి ధన్యవాదాలు'' అన్నారు.
ఇంకా ఈ సినిమాలో సంపత్‌, మల్లిక, సత్యప్రియ, విజయకుమార్‌, సాయి వెంకట్‌, రవిరాజ్‌ బళ్ల, గిరిధర్‌, శివ, స్వామి నటించిన ఈ చిత్రానికి కెమెరా: కర్ణ ప్యారసాని , రమేష్ ,మాటలు : క్రాంతి సైనా , పాటలు: భారతీ బాబు,శ్రీరామ్ , మ్యూజిక్: రవి రాజ్ బళ్ళ , రీ రికార్డింగ్ : ప్రద్యోతన్ , ఎడిటింగ్: శివ వై ప్రసాద్,సోమేశ్వర్ పోచం,సతీష్ రామిడి , గ్రాఫిక్స్ :చందు ఆది నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరాజ్‌ బళ్ల