Janasena : ఓఎన్జీసీపై రెండేళ్ల న్యాయపోరాటం .. ఎట్టకేలకు విజయం : జనసైనికుడిని అభినందించిన నాగబాబు
- IndiaGlitz, [Friday,August 05 2022]
చమురు, సహజ వాయువుల సంస్థలైన గెయిల్, ఓఎన్జీసీ సంస్థలపై గత రెండేళ్లుగా న్యాయ పోరాటం చేసి గెలిచిన రాజోలు నియోజకవర్గంకు చెందిన జనసైనికుడు వెంకటపతి రాజాను అభినందించారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు . కోనసీమ జిల్లాలో జల, భూ కాలుష్యానికి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ) కారణంగా భావించి రూ. 22.72.61.000 జరిమానా విధిస్తూ చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఓఎన్జీసీకి రూ.22.72 కోట్ల జరిమానా:
గెయిల్, ఓఎన్జీసీ సంస్థల కారణంగా, కోనసీమలో జరుగుతున్న అన్వేషణల ఫలితంగా జల కాలుష్యం ఏర్పడుతోందని వెంకటపతి రాజా 2020లో ఆధారాలతో సహా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేశారు. పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడ్డ గెయిల్, ఓఎన్జీసీ సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్జీటీ .. ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. అలాగే ఓఎన్జీసీకి రూ.22.72 కోట్ల రూపాయల జరిమానా విధించింది. జనసేన సిద్ధాంతాలలోని ప్రధానమైన పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడి గెలిచిన వెంకటపతి రాజా జనసేన శ్రేణులకు ఆదర్శంగా నిలిచారని నాగబాబు అభినందించారు.
6 వేల కోట్ల నిధుల మళ్లింపు:
ఇకపోతే.. నిన్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు. ఎస్డీసీ ద్వారా తెచ్చిన రుణాల్లో దాదాపు రూ.6 వేల కోట్లు పక్కకు మళ్లించారని ఆయన ఆరోపించారు. 2020లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ సీబీఐ దత్తపుత్రుడు ఎస్డీసీ మొదలుపెట్టారని నాదెండ్ల దుయ్యబట్టారు. కేంద్రం ఆ ప్రకటన చేసేలోపు ఏపీ ప్రభుత్వం రూ.23 వేల కోట్లను ఎస్‌డీసీ ద్వారా అప్పులు చేసిందని నాదెండ్ల ఆరోపించారు.