'కొండవీటి దొంగ' కు 28 ఏళ్ళు
Send us your feedback to audioarticles@vaarta.com
''ఉన్నవాడిని కొల్లగొట్టి లేనివాడికి పెట్టు" అనే రాబిన్ హుడ్ సిద్ధాంతంతో తెరకెక్కిన చిత్రం 'కొండవీటి దొంగ'. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే మరో మైలురాయిగా నిలిచిన హిట్ మూవీ ఇది. విజయశాంతి, రాధ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో శారద, శ్రీవిద్య, సత్యనారాయణ, రావుగోపాల్ రావు, మోహన్ బాబు, అమ్రీష్ పూరి ముఖ్య పాత్రలు పోషించారు. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.
ఇక కథలోకి వెళితే.. అనాథైన కొండవీటి రాజా(చిరంజీవి) కొండవీడు ప్రజల అండదండలతో ఐ.ఏ.ఎస్. చదువుతాడు. కాని ఆ ప్రాంతంలో భూస్వాములైన శరభోజీ(రావుగోపాలరావు), నరసింహం(మోహన్ బాబు) ఆగడాలవల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. చట్టప్రకారం వారిని ఎదిరించలేమని తెలుసుకున్న రాజా 'కొండవీటి దొంగ'గా మారతాడు. పోలీస్ ఆఫీసర్ అయిన శ్రీలేఖ(విజయశాంతి).. అండర్ కవర్ ఆపరేషన్ తో 'కొండవీటి దొంగ'ను పట్టుకోవడానికి కొండవీడు వస్తుంది.
శ్రీలేఖ చెల్లెలు, డాక్టరైన శ్రీకన్య(రాధ) కొండవీడు ప్రాంతంలో ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించడానికి వచ్చి రాజాయే 'కొండవీటి దొంగ'ని తెలుసుకుంటుంది. వీరిద్దరూ రాజాను ప్రేమిస్తారు. 'కొండవీటి దొంగ'గా మారిన రాజా తను అనుకున్న పనిని పూర్తిచేశాడా? శ్రీలేఖ 'కొండవీటి దొంగ'ను పట్టుకోగలిగిందా? వీరిద్దరిలో రాజా ఎవరి ప్రేమను పొందాడు? అసలు రాజా అనాథగా మారడానికి కారకులు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.
'కొండవీటి దొంగ'గా చిరంజీవి గెటప్ ఆకట్టుకుంటుంది. ఇళయరాజా స్వరపరచిన పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ చిత్రంలోని "శుభలేఖ రాసుకున్న" పాటను 'నాయక్' సినిమాలో.. "చమక్ చమక్" పాటను 'ఇంటిలిజెంట్' సినిమాలో రీమిక్స్ చేశారు. మార్చి 9, 1990న విడుదలైన ఈ చిత్రం.. నేటితో 28 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments