Konaseema SP Sridhar:ఎన్టీఆర్ అభిమాని అనుమానాస్పద మృతి : శ్యామ్ మరణానికి కారణమిదే, కోనసీమ ఎస్పీ సంచలన ప్రకటన
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ అనుమానాస్పద మృతి తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అతని మరణంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఎన్టీఆర్ అభిమానులు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. మరోవైపు శ్యామ్ మృతికి వైసీపీ నేతలే కారణమని తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ స్పందించారు. శ్యామ్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని.. సమాచారం అందిన వెంటనే తమ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. దీనిపై సెక్షన్ 174 కింద దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీధర్ స్పష్టం చేశారు.
మణికట్టు కోసుకున్నాకే ఉరి :
శ్యామ్ జూన్ 25న సాయంత్రం 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల మధ్య చనిపోయి వుండొచ్చని వైద్యులు తెలిపారని ఎస్పీ చెప్పారు. శ్యామ్ చేతి మణికట్టును బ్లేడుతో కోసుకున్నట్లు వైద్యులు గుర్తించారని.. ఇందుకోసం ఉపయోగించిన బ్లేడు అతని జేబులో దొరికిందని ఆయన తెలిపారు. మణికట్టును కోసుకున్న తర్వాత శ్యామ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని వుండొచ్చని డాక్టర్లు నిర్ధారించారని శ్రీధర్ పేర్కొన్నారు. శ్యామ్ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించామని, అతని మరణానికి ప్రేమ వ్యవహారంతో పాటు చదువులో వెనుకబడటమే కారణమని ఎస్పీ అభిప్రాయపడ్డారు.
ఆత్మహత్య కాదంటోన్న ఫ్యాన్స్ :
తూర్పుగోదావరి జిల్లా కొప్పిగుంట గ్రామానికి చెందిన శ్యామ్.. చింతలూరులో చనిపోయాడు. దీంతో అతని మరణంపై వైఎస్ జగన్ ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేసి, శ్యామ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవరైనా అతనిని చంపి , ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనికి వారు చూపుతున్న కారణాలు కూడా బలంగా వున్నాయి.
శోకసంద్రంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ :
‘‘ ఉరి వేసుకున్న వ్యక్తి కాళ్లు నేలకు తాకి ఎలా వుంటాయి... ? శరీరం మీద మరియు ముక్కు మీద గాయాలు ఎందుకు వుంటాయి..? జేబులో గంజాయి ప్యాకెట్లు వుంటే ఆ మత్తులో ఉరి ఎలా వేసుకుంటాడు..? హ్యాండ్ కట్ చేసుకుంటే అంత నిలకడగా ఎలా ఉరి వేసుకుంటాడు..? ’’ అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్యామ్ మరణంపై దర్యాప్తు చేయాలని వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నారు. ఈ మేరకు ‘‘ #WeWantJusticeForShyamNTR ’’ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. అంతేకాదు.. ఇండియా ట్విట్టర్ ట్రెండ్స్‌లో అది టాప్‌లో కొనసాగుతోంది. మరోవైపు శ్యామ్ మరణవార్తతో ఎన్టీఆర్ అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అతనికి సోషల్ మీడియా ద్వారా నివాళుర్పిస్తూ వుండగా.. కొందరు ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టి శ్యామ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments