కేటీఆర్.. ఈ పిల్లర్ డ్యామేజ్ అయ్యింది చూడండి!
- IndiaGlitz, [Thursday,September 26 2019]
హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన అమీర్‌పేట మెట్రోలో జరిగిన ఘటనతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో..? ఎవరి ప్రాణాలకు ముప్పు వచ్చి పడుతుందో..? అంతేకాదు.. అసలు మెట్రో ప్రయాణం అవసరమా..? అన్నట్లుగా హైదరాబాదీలు ఆలోచిస్తున్నారు. అమీర్‌పేటలో జరిగిన ఈ ఘటన అనంతరం ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఓ వైపు ఎల్అండ్‌టీ అధికారులు.. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవన్నీ అటుంచితే.. హైదరాబాద్ వాసులు కూడా వారి దృష్టికి వచ్చిన విషయాలను మంత్రి కేటీఆర్‌తో పాటు ఎల్అండ్‌టీ అధికారులకు సోషల్ మీడియా ద్వారా వారి దృష్టికి తీసుకెళ్తున్నారు.
మొన్నే రిపేర్.. అప్పుడే ఇలా..!
తాజాగా.. భాగ్యనగరానికే తలమానికంగా నిలిచిన పీవీ ఎక్స్‌ప్రెస్ వే ప్రమాద బారిన పడిందని తెలుస్తోంది. మెహిదీపట్నం నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఉన్న ఈ ఫ్లై-ఓవర్ పిల్లర్ ఒకటి పగుళ్లకు గురైంది. పిల్లర్ నంబర్ 20 వద్ద జాయింట్లు కొన్ని పగిలి.. ప్రమాద కరంగా మారింది. వాస్తవానికి ఈ మధ్యే కొన్ని కోట్లు ఖర్చుపెట్టి మరీ.. ఫ్లై ఓవర్‌పై గుంతలు ఉన్నాయంటూ రిపేర్లు చేపట్టారు. అయితే ఈ క్రమంలో ఇలా పగుళ్లు వచ్చాయని వార్తలు వస్తుండటం గమనార్హం.
కేటీఆర్ సాబ్.. చర్యలు తీసుకోండి!
ఈ విషయాన్ని టాలీవుడ్ సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్.. తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ‘పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 20 వద్ద డ్యామేజ్ అయింది. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకముందే చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. అంతేకాదు.. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైతం వెంకట్ షేర్ చేశారు. కాగా సామాజిక విషయాల్లో కోన వెంకట్ బాధ్యతగానే ప్రవర్తిస్తుంటారన్న విషయం తెలిసిందే.