Rajgopal Reddy: హరీష్‌రావును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రాజగోపాల్‌ రెడ్డి

  • IndiaGlitz, [Monday,February 12 2024]

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల విమర్శలు, ప్రతివిమర్శలతో సభ వేడెక్కింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్‌చాట్ చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్‌రావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. హరీష్‌ కష్టపడతారని బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు భవిష్యత్తు లేదన్నారు. తనతో పాటు 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తే.. హరీష్‌రావుకు దేవాదాయశాఖ మంత్రి పదవి కూడా ఇస్తామన్నారు.

అలాగైనా చేసిన పాపాలు కడుక్కోవచ్చని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్‌రావు, కడియం శ్రీహరి లాగా తాము జీ హుజూర్ బ్యాచ్ కాదని.. ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీని చీల్చాలని గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారని మండిపడ్డారు.చీప్ పాలిటిక్స్ మానుకోవాలని హితవు పలికారు. తాము పదవుల కోసం కాదు.. ప్రజల కోసం పనిచేసే వాళ్లమని చెప్పారు. ఉద్యమ సమయంలో పదవులను వదులుకున్న చరిత్ర తమదని గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని... ఇప్పుడు తెలంగాణను కాపాడుకునే బాధ్యత తమపై పడిందని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ నల్గొండ సభ కోసం డబ్బులు పెట్టి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రజల కాళ్లు పట్టుకుంటున్నారని ఆరోపించారు. ఆ సభకు ప్రజలు రారని కార్యకర్తలు మాత్రమే వస్తారని విమర్శించారు. కేటీఆర్‌కు దమ్ముంటే పార్టీని నడపాలని సవాల్ విసిరారు. కచ్చితంగా నల్గొండ సభ అట్టర్ ప్లాప్ అవుతుందని వెల్లడించారు. అంతకుముందు అసెంబ్లీలో కూడా హరీష్‌రావు, కేసీఆర్‌పై రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. హరీష్ ఎంత కష్టపడినా ఆ పార్టీలో విలువ ఉండదని ఆయన సెటైర్లు వేశారు. అయితే హరీష్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.