ప్రశాంత్ కిశోర్‌తో ఇళయ దళపతి విజయ్ భేటీ.. వేదిక హైదరాబాద్, అసలేం జరుగుతోంది..?

  • IndiaGlitz, [Thursday,March 17 2022]

కరుణానిధి, జయలలిత వంటి రాజకీయ దిగ్గజాల మరణంతో తమిళ రాజకీయాల్లో ఒక శూన్యం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిని భర్తీ చేసేందుకు అగ్ర కథనాయకులు కమల్ హాసన్, రజనీకాంత్ రంగంలోకి దిగారు. ఈ ప్రయత్నాల్లో రజనీ మధ్యలోనే తప్పుకోగా.. కమల్ మాత్రం అదే దారిలో వెళ్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా.. ముఖ్య నేతలు రాజీనామా చేసినా మక్కల్ నీది మయ్యమ్‌ను నడుపుతున్నారు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన పార్టీని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో మరో స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ కూడా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా అంటూ అవుననే అంటున్నాయి పరిణామాలు. రజనీ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న విజయ్ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో అభిమానులు కోరుతున్నారు. అయితే ఆయన మాత్రం ఊహాగానాలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. అయితే ఈసారి మాత్రం విజయ్ స్వయంగా రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది.

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను విజయ్ ఇటీవల హైదరాబాద్‌లో కలిశారంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది. రహస్యంగా భేటీ అయిన వీరిద్దరూ తాజా దేశ, తమిళ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయంపై విజయ్ సన్నిహితుడు ఒకరు మాట్లాడుతూ.. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారిపోయాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన డీఎంకేను ఎదురొడ్డడం అన్నాడీఎంకేకు దాదాపు అసాధ్యమని అభిప్రాయపడ్డారు. పార్టీ భవితవ్యం ఏంటో తెలియక ఆ పార్టీ నేతలు సతమతమవుతున్నారని, అలాగని వారు డీఎంకేలో చేరేందుకు ఇష్టపడడం లేదన్నారు. ఈ తరుణంలో విజయ్ కనుక కొత్త పార్టీ పెడితే అందులో చేరేందుకు వారందరూ సుముఖంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

తమిళనాడులో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కంకు చెందిన పలువురు అభ్యర్థులు గెలుపొందారు. గెలిచిన వారిని ఇంటికి పిలుపించుకున్న విజయ్ వారితో ముచ్చటించి ఫొటోలు కూడా దిగారు. దీంతో ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రావడం తథ్యమన్న వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. తాజాగా పీకేతో విజయ్ భేటీ కావడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయ్యింది.